• మూతబడిన విద్యాసంస్థలు
• పలు జిల్లాల్లో అరెస్టులు, ఉద్రిక్తత
• రాష్ర్టవ్యాప్తంగా విద్యార్థి, యువజన ర్యాలీలు, నిరసనలు
ప్రజాశక్తి- యంత్రాంగం : ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జిని నిరసిస్తూ, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టిఎ)ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ కు స్వచ్ఛంద మద్దతు లభించింది. నారాయణ, చైతన్య వంటి కార్పొరేటర్ విద్యా సంస్థల సహా, ప్రైవేట్ విద్యా సంస్థలు ముందుగానే సెలవు ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తేదీని ఖరారు చేయడంతో ప్రభుత్వ పాఠశాలలు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ కే పరిమితమయ్యాయి. పలు జిల్లాల్లో విద్యార్థి, యువజన నాయకులను అరెస్టు చేసేందుకు పూనుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ర్టవ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, ఎఐఎస్ఎఫ్, పిడిఎస్‌యు, ఎన్ఎస్‌యుఐ,ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.
విజయవాడలో 237 ప్రైవేట్ విద్యా సంస్థలు మూతబడ్డాయి. బంద్‌లో భాగంగా మొగల్రాజపురం పిబి సిద్ధార్థ కళాశాల వద్ద మోకాళ్లపై విద్యార్థులు నిలబడి నిరసన తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా ప్రభుత్వ ఐటిఐ, ప్రభుత్వ పాలిటెక్నిక్, లయోలా ఇంజనీరింగ్ కళాశాల మీదుగా ప్రదర్శన నిర్వహిస్తూ బంద్‌లో భాగస్వాములు కావాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్న కుమార్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, పిడిఎస్ యు రాష్ట్ర కార్యదర్శి ఐ.రాజేష్, పిడిఎస్ఒ రాష్ట్ర నాయకులు భాను, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బంద్‌కు సహకరించాలని కోరిన విద్యార్థి, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం కోట జంక్షన్ వద్ద ఆందోళన నిర్వహించి , రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ర్ట అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ...బిజెపి ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీక్ అయ్యాయని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చలో పార్లమెంట్ కార్యక్రమంలో విద్యార్థులపై బాష్ప వాయువు ప్రయోగించడం దారుణమన్నారు. తక్షణమే ప్రధానమంత్రి స్పందించి, ధర్మేంద్రప్రధాన్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎఐఎస్ ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి మెయిన్ రోడ్డు వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్ టిసి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. కర్నూలులోని ప్రభుత్వ టౌన్ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన "మెగా పేరెంట్-టీచర్ మీటింగ్"కు విచ్చేసిన ఎమ్మెల్సీ బిటి నాయుడును విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి నాయకులను పోలీసులు ని ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జిని నిరసిస్తూ, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర లువరించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
అనంతరం నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్సీకి అందజేశారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో విధులకు హాజరైన సిబ్బందిని విద్యార్థి సంఘాల నాయకులు బయటకు పంపివేసి తమ నిరసన తెలిపారు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద బంద్ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకో వడంతో తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు నాయకులను అరెస్టు చేసి పలు స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. గురువారం అర్ధ రాత్రి నుండి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్భంధం చేశారు.
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోకి విద్యార్థులను పంపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యార్థి నాయకులు ప్రతిఘటించడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. పాతపట్నంలో ఏడుగురు ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అనంతపురంలో పోలీసుల సాయంతో కెఎస్‌ఎన్ కళాశాల తరగతులు నిర్వహిస్తోందని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆ కళాశాల వద్దకు వెళ్లారు. కళాశాల ప్రధాన ద్వారం తెరిచేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 20 మంది విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అరెస్టు చేసి నగరంలోని వివిధ స్టేషన్లకు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయ్యింది.
ఒంగోలు కలెక్టరేట్ ఎదుట రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బంద్ విజయవంతమైంది. కడప, అన్నమయ్య జిల్లాల్లో స్కూటర్ ర్యాలీలు నిర్వహించారు. గుంటూరులో ప్రముఖ కాలేజీలన్నీ స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాకినాడ జెఎన్ టియుకె వద్ద ధర్నా చేశారు. తాళ్లరేవు జూనియర్ కాలేజ్ మరియు హై స్కూల్ విద్యార్థులు తాళ్లరేవు సంతపేట సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన చేసి తహశీల్దార్ కార్యాలయం వద్ద రాస్తారోకో చేశారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, రామచంద్రపురంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నెల్లూరు జిల్లా గూడూరులో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తిరుపతి, చిత్తూరులో బంద్ కు పలు విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. బంద్ సందర్భంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ దూర విద్య కేంద్రంలో ఆధ్వర్యంలో జరగాల్సిన పరీక్షలు ఆగస్టు నాలుగో తేదీకి వాయిదా పడ్డాయి. మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీ వద్ద మెగా పిటిఎం కార్యక్రమం విద్యార్థుల నిరసనతో వాయిదా పడింది. ఆంధ్ర యూనివర్సిటీ ముఖ ద్వారం నుంచి మద్దిలపాలెం వరకూ ర్యాలీ నిర్వహించి, జంక్షన్‌లో మానవహారం చేపట్టారు. అనకాపల్లి, అల్లూరి జిల్లా కేంద్రం సహా మండలాల్లో బంద్ విజయవంతమైంది. ఏజెన్సీలో బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘం, సిఐటియు, మద్దతు తెలిపాయి.







కామెంట్‌లు (0)