శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచదువే శాశ్వత ఆస్తి

1 గంట క్రితం

cbn
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:57 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • ప్రభుత్వ బడులపై పెరుగుతున్న నమ్మకం

  • తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు కలిస్తేనే విద్యార్థుల విజయం

  • గిరిజనులకు అండగా ఉంటాం... ఆందోళన వద్దు

  • రంపచోడవరంలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో సిఎం చంద్రబాబు

ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి, రాజవొమ్మంగి విలేకరి (పోలవరం జిల్లా) : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే ప్రధాన లక్ష్యమని, చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ - టీచర్ మీటింగ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఇప్పటికే గణనీయమైన మార్పులు ప్రారంభమయ్యాయ న్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల నుంచి లక్షా పది వేల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరడం ప్రభుత్వ విద్యపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు మట్టిలో మాణిక్యాలని, సరైన అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. విద్యే పిల్లలకు తల్లిదండ్రులు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి అని, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు రాణించడానికి విద్యే కారణమని పేర్కొన్నారు. పిల్లల అభివృద్ధి బాధ్యతను తల్లి, తండ్రి ఇద్దరూ సమానంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌లకు తల్లులతో పాటు తండ్రులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్మించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులేనని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా మెగా పిటిఎంలను నిర్వహిస్తున్నామన్నారు. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా బోధనా విధానాలను మార్చుకోవాలని, కొత్త పద్ధతులను అవలంబించాలని ఉపాధ్యాయులకు సూచించారు. టీచర్లకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తోందని, బదిలీలను పారదర్శక కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు.

ఆరోగ్యం, ఉపాధిపై ప్రత్యేక దృష్టి

తల్లికి వందనం పథకం నిధులు ఇప్పటికే తల్లుల ఖాతాల్లో జమయ్యాయని చెబుతూ... జమ అయ్యాయా? లేదా? అంటూ సభలోనే ప్రజలను అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రజారోగ్యంపై దృష్టి సారించామని, ఆగస్టు నుంచి సంజీవని హెల్త్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఐఐటి కోచింగ్ అందిస్తున్నా మన్నారు. గిరిజన ప్రాంతాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలను విస్తరిస్తామని ప్రకటించారు. రంపచోడవరం నియోజకవర్గంలో గతంలో కొందరు దుర్మార్గాలు చేశారని, దళిత డ్రైవరును చంపి డోర్ డెలివరీ చేసిన నేత ఇక్కడ రాజకీయం చేశారని విమర్శించారు. ​

డ్రగ్స్‌కు చెక్...

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం

గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టి ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ కల్పించామని తెలిపారు.

జిఒ 3పై చర్చిస్తున్నాం

2000లో జిఒ నెంబర్-3 తెచ్చి స్థానిక గిరిజనులకే ఉద్యోగాలిచ్చేలా అండగా నిలబడ్డామని చంద్రబాబు తెలిపారు. కానీ, 2020లో సుప్రీం కోర్టు ఆ జిఒను రద్దు చేసిందని, దీనిపై ఇప్పుడు చర్చిస్తున్నామన్నారు. గిరిజనులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

విద్యార్థుల కలలకు సిఎం ప్రోత్సాహం

సభలో పలువురు విద్యార్థులు తమ లక్ష్యాలు, ఆశయాలను వెల్లడించగా... ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వారిని అభినందించారు. తాను భవిష్యత్తులో ఐఎఎస్ అధికారిగా మారి ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తానని చెప్పిన విద్యార్థి సాత్విక్‌ను సిఎం ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆ విద్యార్థి సంకల్పం తప్పకుండా నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పాఠశాల విద్యా శాఖ రూపొందించిన ‘డ్రగ్స్ వద్దు బ్రో’ హ్యాండ్‌ బుక్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం ‘బడి కోసం డోనర్’ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.

పేరెంట్స్, టీచర్లతో ముఖాముఖి

మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా రంపచోడవరం ప్రభుత్వ హైస్కూలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు, మార్కులు, హాజరు, ఆరోగ్య వివరాలను స్వయంగా పరిశీలించి తల్లిదండ్రులకు వివరించారు. ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల

ప్రోగ్రస్ రిపోర్టులను వారి ఇళ్లకే పంపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మరో తరగతి గదిలో స్మార్ట్ బోర్డు ద్వారా బోధనా విధానాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి... కొద్దిసేపు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం మెగా పిటిఎం ఫొటోఫ్రేమ్ వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫొటో దిగారు. మీటింగ్ అనంతరం విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పోషకాహారం మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి, కలెక్టర్‌ ‌దినేష్‌ ‌కుమార్‌, విద్యా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్