శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకృష్ణా డెల్టాలో వరి వేస్తే నష్టపోతారు

1 గంట క్రితం

ENC Narasimhamurthy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 11:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పట్టిసీమ పంపింగ్‌ తగ్గింది

  • తాగునీటికే తొలి ప్రాధాన్యత

  • ఇరిగేషన్ ఇఎన్‌‌సి నరసింహమూర్తి

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇస్తామని, రైతులు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలని ఇరిగేషన్ ఇఎన్‌‌సి నరసింహమూర్తి తెలిపారు. విజయవాడలోని జలవనరులశాఖ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. రాష్ట్రంలో సాధారణం కంటే 51 శాతం, కృష్ణా డెల్టా పరిధిలో 49 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో సుమారు 50 టిఎంసిలు, తుంగభద్రలో మరో 70 టిఎంసిలు కుషన్ (ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువ) ఉండటంతో అవి నిండితేనే శ్రీశైలానికి నీరొచ్చే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కూడా కుషన్ నింపిన తర్వాతే దిగువ ప్రాంతాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని చెప్పారు. ప్రభుత్వం 2027 జూన్ వరకు గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ చేపడుతోందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో ఉన్నా వినియోగించదగిన నీటిని కూడా తాగునీటి అవసరాల కోసమే భద్రపరిచామని వెల్లడించారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా ఆర్‌ఎంసి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ, గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణలో వర్షాభావం కారణంగా ఎగువ జలాశయాలు పూర్తిగా నిండలేదని, సీలేరు ద్వారా వచ్చే నీటి లభ్యత కూడా తగ్గిందన్నారు. సాధారణంగా 100 నుంచి 125 రోజులపాటు ఉండే గోదావరి ప్రవాహం ఈసారి 60 నుంచి 70 రోజులకే పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా సాగుకు సుమారు 150 టిఎంసిల నీరు అవసరమైనప్పటికీ, ప్రస్తుతం అంత నీటి లభ్యత లేదన్నారు. పట్టిసీమ పంపింగ్‌లో కూడా ప్రవాహం తగ్గడంతో అన్ని పంపులనూ ఒకేసారి నడపడం సాధ్యం కావడం లేదని వివరించారు. ఏలూరు, కృష్ణా, ఎన్‌‌టిఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సుమారు 60 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎంసి కాల్వ నుంచి అనధికారికంగా పంపులు ఏర్పాటు చేసి నీటిని తీసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ఈ చర్యలతో అనధికారిక పంపుల వినియోగం కొంత మేర తగ్గిందన్నారు. ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వరి సాగు కాకుండా వేరే పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. వరి నాటితే మధ్యలో నీరు అందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహాలు పెరిగితే వ్యవసాయ శాఖతో చర్చించి పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితులను రైతులు అర్థం చేసుకుని విజ్ఞతతో వ్యవహరించాలని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి అవసరాలు పూర్తిగా తీర్చిన తర్వాతే మిగిలిన నీటిని ఆరుతడి పంటలకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని నరసింహమూర్తి తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్‌శాఖ సిఇ బి రాంబాబు, ఎస్ఇ జె సుగుణాకర్ పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్