సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అత్యంత న్యాయమైన డిమాండ్‌పై విద్యార్థులు దేశవ్యాపితంగా శాంతియుతంగా సాగిస్తున్న పోరాటంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిందలు మోపి, అన్యాయమైన ఆరోపణలు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. దీనిపై రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షా పేపర్ లీక్‌చేసి అమాయకులైన విద్యార్థుల ఆత్మహత్యలకు, ఆయా కుటుంబాల క్షోభకు కారణమైన వారిపైనా, తీవ్రమైన నిర్బంధంపైనా ఒక్కమాట కూడా మాట్లాడని పవన్‌కల్యాణ్‌కు విద్యార్థులను విమర్శించే హక్కు లేదని అన్నారు. దేశవ్యాపితంగా సాగుతున్న ఉద్యమానికి మేధావులు, సామాజిక వేత్తలు, వివిధ వర్గ ప్రజా సంఘాల నాయకులతోపాటు, సినీరంగ ప్రముఖు లు, లబ్దప్రతిష్టులైన క్రీడాకారులు సంఘీభావం తెలుపుతున్నారని పేర్కొన్నారు. అంత విశాలమైన ఉద్యమానికి వ్యతిరేకంగా రాళ్ళువేయడం ఎవరికి మేలు చేయడానికో ఉప ముఖ్యమంత్రే ఆలోచించు కోవాలని సూచించారు. ఇప్పటికైనా విద్యార్థి లోకంపై తాను చేసిన నిరాధార ఆరోపణలను ఉప సంహరించుకోవాలని, భేషరతుగా వారికి క్షమాపణ చెప్పాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ఏజెన్సీలో నిర్బంధంపై సిపిఎం ఖండన
రంపచోడవరం సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్నారనే పేరుతో ఆదివాసీ గిరిజన సంఘం, సిపిఎం నాయకులను నిర్బంధించడం, హౌస్ అరెస్టులు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివాసీ యువత ఆగ్రహాన్ని గుర్తించి ముఖ్యమంత్రి సభలో స్పెషల్ డిఎస్‌సి ప్రకటించాలని, 1/70 చట్ట రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు సమగ్ర పునరావాసం, పోడు భూములకు పట్టాలివ్వాలన్న గిరిజనుల కోర్కెలపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని శ్రీనివాసరావు కోరారు.







కామెంట్‌లు (0)