ముఖ్యమంత్రి వ్యాఖ్యపై ఎన్నికల సంఘానికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపినట్లుగా ఓటర్లకు డబ్బు పంపిణీపై విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు వి.శ్రీనివాసరావు ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఆగస్టు 15, 2026 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'స్త్రీ శక్తి' గ్రూప్ మహిళలతో మాట్లాడుతూ ఓటుకు రూ. 2,000 చొప్పున డబ్బులు తీసుకో వద్దని, వాటిని తిరస్కరించాలని కోరారని లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు డబ్బులు పంపిణీ చేస్తున్నాయని ఇది స్పష్టంగా తెలియజేస్తోందని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రజలపై ఇంత పెద్ద ఆరోపణలు చేసినప్పుడు, ఈ డబ్బు పంపిణీ ఎలా జరుగుతోంది, ఈ రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే దానిపై విచారణ జరపాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని ఈ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య ఎన్నికల వ్యవస్థ ఎలా భ్రష్టుపడుతుందో తెలుపుతోందని పేర్కొన్నారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేకపోతున్నారని తెలిపారు. ఎన్నికలు, ఓట్లను మార్కెట్ వస్తువుగా పాలకులు మార్చేశారని వివరించారు. ప్రజాస్వామ్యం ధనిక స్వామ్యంగా మారుతోందని, ఈ ప్రమాదకర పరిస్థితిని నివారించి, ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూసే బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి, విచారణ జరిపి, ఎన్నికల్లో డబ్బు పంపిణీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ లేఖ కాపీని భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు పంపారు.






కామెంట్‌లు (0)