శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పించాలి

56 నిమిషాల క్రితం

rythu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 10:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రైతు సంఘాల సమన్వయ సమితి డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పొగాకు రైతులకు మెరుగైన ధర కల్పించి ఆదుకోవాలని రైతు సంఘాల రాష్ట్ర నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. శనివారం విజయవాడ బాలోత్సవ భవన్‌లో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం చుండురు రంగారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభానాద్రేశ్వరరావు మాట్లాడుతూ ఎఫ్‌సివి పొగాకుకు కిలో రూ.210 నుంచి రూ.350 వరకు ధర కల్పించాలని కోరారు. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపకుండా రైతులకు న్యాయం చేయాలన్నారు. ఎపి రైతు సంఘం అధ్యక్షులు కృష్ణయ్య మాట్లాడుతూ ఐటిసి యాజమాన్యం చొరవ తీసుకుని రైతులకు మెరుగైన ధర కల్పించాలని కోరారు. 1995 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.ఆ ఏడాది పొగాకు రైతులు అధికంగా ఆత్మహత్యలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు .అప్పులు తీరక రైతులు తిరిగి సాగుకు రుణాల కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకులోని వివిధ రకాల పంటలకు రైతులకు న్యాయమైన ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొనుగోళ్లు మందగించడంతో బేళ్లు నిల్వలు పేరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకులో 27 రకాలు ఉన్నాయని, రకాన్ని బట్టి ధర కాకుండా అన్ని రకాల పంటలకు ఒకే ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల ఈశ్వర్‌ మాట్లాడుతూ దళారీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కంపెనీల, వ్యాపారులు గ్రామాల్లోకి వచ్చి ఇష్టారీతిన పొగాకు కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు, కౌలు రైతులకు అందని రీతిలో రుణ విధానాలు ఉండడం సరికాదన్నారు. రంగారావు మాట్లాడుతూ పొగాకు సాగుకు అయ్యే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులను పరిగణనలోకి తీసుకుని సి2+50 శాతం మేర ధర కల్పిస్తేనే రైతుకు గిట్టుబాటువుతుందన్నారు. రైతులకు మెరుగైన ధరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రైతు సంఘాల నాయకులు వై కేశవరావు, సింహాద్రి ఝాన్సీ, లలిత, ఎఐకెఎంఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కిసాన్‌ సంఘటన్‌ రాష్ట్ర కన్వీనర్‌ మరీదు ప్రసాద్‌బాబు, వేమారెడ్డి, ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్