ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమణిపూర్‌లో మళ్లీ నెత్తుటిధార

1 గంట క్రితం

మణిపూర్‌లో మళ్లీ నెత్తుటేరులు
- తొమ్మిది మంది మృతి, 14 ఇళ్లకు నిప్పు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 12:27 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తొమ్మిది మంది మృతి, 14 ఇళ్లకు నిప్పు

ఇంఫాల్‌ : డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఏలుబడిలోని మణిపూర్‌లో నెత్తుటేరులు పారుతూనే ఉన్నాయి. వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. నాగా, కుకీ గ్రూపులకు చెందిన సుమారు 14 ఇళ్లను దుండగులు తగలబెట్టారు. రాష్ట్రంలోని కామ్‌జోంగ్, కాంగ్‌పోక్పి మరియు ఉఖ్రుల్ జిల్లాల్లో శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైన కాల్పులు, దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్‌ ముఖ్య మంత్రి వై. ఖేమ్‌చంద్‌ సింగ్‌ ఢిల్లీలో ప్రధాని మోడీని కలిశారు. రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు అన్ని విధాలా సహకరిస్తామని మోడీ హామీ ఇచ్చినా రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రాలేదు.

స్థానికుల కథనం ప్రకారం కామ్‌జోంగ్ జిల్లా చస్సాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో గ్రామ వలంటీర్లను ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ (ఐఆర్‌బి), పోలీసులు ఏకపక్ష‍ంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ చస్సాద్‌కు చెందిన మహిళలు శుక్రవారం రాత్రి ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 42 ఏళ్ల కుకీ మహిళ డోమ్‌ఖోనీ టౌథాంగ్ ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల కథనం ప్రకారం.. అక్రమ బంకర్లను తొలగించేందుకు మణిపూర్‌ పోలీసులు, ఐఆర్‌బి, సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా చేపట్టిన చర్యలను స్థానిక మహిళలు

అడ్డుకునేందు కు ప్రయత్నించారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో, భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఆ ఘటనలో టౌథాంగ్‌ మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమెకు ఐదుగురు పిల్లలున్నారు. ఆమె మరణంతో ఇరు గ్రూపుల మధ్య కాల్పులు, దహనకాండ చెలరేగాయి. కనీసం 14 ఇళ్లు తగలబడ్డాయి. శనివారం చస్సాద్‌లో జరిగిన ఘర్షణల్లో 23 ఏళ్ల యువకుడు మైఖేల్ న్గామిన్లెన్ హావోకిప్ మరణించాడు. నాగా తిరుగు బాటుదారుల కాల్పుల్లోనే హావోకిప్‌ మరణించినట్టు కుకీ మహిళా సంఘం తెలిపింది. శనివారం తెల్లవారుజామున చస్సాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు నిప్పంటించేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించడంతో మళ్లీ కాల్పులు జరిగాయి. నింగ్చౌ చింగ్‌డాంగ్‌ వద్ద ఇద్దరు నాగా గ్రామ రక్షకులు న్గచాన్సో నింగ్షెన్‌ (30), లీషిషన్‌ హుంగ్యో (50) హత్యకు గురయ్యారు. మకుయి గ్రామంలో మరో ముగ్గురు నాగా గ్రామ రక్షకులు మచుంగమ్మంగ్‌, అజిన్‌పౌ రింగ్‌కంగ్‌మై, రోబార్ట్‌ మరణించారు. కాంగ్‌పోక్పి జిల్లా టపోన్‌ గ్రామం వద్ద దాడిలో నాగా గ్రామ వాలంటీర్‌ మచుంగ్‌వాంగ్‌బౌ (35) మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉఖ్రుల్‌ జిల్లాలో జాతీయ రహదారి-202పై కారులో ప్రయాణిస్తున్న సందీప్‌ రాయ్‌ (30)ను గుర్తుతెలియని సాయుధులు కాల్చిచంపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్