శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిమితికి మించి అభ్యర్ధులు ఖర్చు చేయరాదు

1 గంట క్రితం

anil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 16, 2026, 08:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన ద్వారా నిర్ణయించిన పరిమితికి మించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఎన్నికల ఖర్చు చేయరాదని అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు. అన్ని జిల్లాలకు అభ్యర్దుల వ్యయ పరిశీలకులను నియమించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వ్యయ పరిశీలకులతో సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి రోజు రోజువారీ ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా సదరు అభ్యర్థికి ఎన్నికల వ్యయాన్ని నమోదు చేయడానికి కావాల్సిన నిర్దిష్ట నమూనాలను ఉచితంగా నిర్ణీత సమయంలో రిటర్నింగు అధికారి అందజేసేలా రిటర్నింగు అధికారులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల లోపల పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తన మొత్తం ఎన్నికల ఖర్చు వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి తప్పక సమర్పించాలని తెలిపారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నిర్వహణ తీరుకు సంబంధించి అభ్యర్ధులకు, వారి ఏజెంట్లకు, సామాన్య ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని వ్యయ పరిశీలకులకు ఎన్నికల కమిషనర్ పునేఠా ఆదేశించారు. రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించకుండా పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే ఘటనలపై అప్రమత్తంగా ఉంటూ, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పోలింగు ముగిసే 48 గంటల నుండి, పంచాయతీలలో పోలింగ్ ముగిసే 44 గంటల ముందు నుండి మధ్యం సరఫరా నిలుపుదల చేయాలని, పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్రమ మద్యం సరఫరా, అమ్మకాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత బాధ్యతాయుతంగా,స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్