మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పేపర్ లీకేజీలపై సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు

1 రోజు క్రితం

congress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 10:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశంలో 2014 నుంచి ఇప్పటి వరకు 152 పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకుని 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై ప్రభావం చూపాయని ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ‘ఛాత్రోన్ కీ గూంజ్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని, పేపర్ లీక్ నిరోధక కఠినమైన నిభందనలతో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థులకు రూ.10 వేల పరిహారం అందించాలని, అదనపు రుసుము లేకుండా ఉచితంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. పేపర్ లీకేజీలు, ఉద్యోగాల కొరతతో యువతపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల విక్రయం, ర్యాంకుల విక్రయం వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, జాతీయ పరీక్షల సంస్థలో సమూల మార్పులు చేపట్టాలని కోరారు. కాంగ్రెస్‌ నేత కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ.. ఏపీలో నీట్‌-యూజీ పరీక్ష వివాదం కారణంగా సుమారు 60 వేల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ఆగస్టు 9న రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ–విద్యార్థి గర్జన’ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పేపర్ లీకేజీలను అరికట్టడం, ర్యాంకుల విక్రయాన్ని నిరోధించడం, అధిక ఫీజులను నియంత్రించడం, పారదర్శక పరీక్షా విధానం కోసం సమగ్ర విద్యా పరిరక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్