- శతవసంతోత్సవ సభలో పి.మధు
ప్రజాశక్తి - నూజివీడు టౌన్ (ఏలూరు టౌన్) : సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, భూ పోరాట యోధులు చలసాని జగన్నాథరావు ఈ తరానికి ఆదర్శమని సిపిఎం పూర్వ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు అన్నారు. చలసాని జగన్నాథరావు శతవసంతోత్సవ సభ సిపిఐ సీనియర్ నాయకులు కొమ్మన నాగేశ్వరరావు అధ్యక్షతన నూజివీడు పట్టణంలోని రోటరీ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జగన్నాథరావు ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. ఆయన కుటుంబం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైందని కొనియాడారు. ఎపి రైతు సంఘ రాష్ట్ర నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ జగన్నాథరావు అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన ప్రజా నాయకుడన్నారు. నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి పోరాడేవారని తెలిపారు. ప్రాణహాని ఎదురైనా వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం ధైర్యంగా నిలబడ్డారని కొనియాడారు. త్యాగాల బాటే భవిష్యత్తుకు బాట అని, జగన్నాథరావు శతవసంతాలు పూర్తి చేసుకోవడం ఒక వ్యక్తి జీవిత ఘట్టం మాత్రమే కాదని ఎనిమిది దశాబ్దాల కమ్యూనిస్టు పోరాట చరిత్రకు ఒక ప్రతీక అని సభలో వక్తలు పేర్కొన్నారు. ప్రజల హక్కుల కోసం ఆయన ఎత్తిన ఎర్రజెండా, అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన వినిపించిన గళం, పేదల కోసం ఆయన సాగించిన పోరాటం భావితరాలకు మార్గదర్శకతమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, మాజీ శాసనసభ్యులు మానం ఆంజనేయులు, సిపిఐ రాష్ట్ర నాయకులు జె.వి.వి.సత్యనారాయణమూర్తి, సిపిఐ ఎంఎల్ నాయకులు హరినాథ్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నావా కృష్ణ చైతన్య, సిపిఐ జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు బిఆర్.తులసీరావు, జి.రాజు, సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్.ఆర్.హనుమానులు, టిడిపి నాయకులు కాపా శ్రీనివాసరావు, పలువురు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్లు, జగన్నాథరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)