- మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలి
- సిఐటియు రౌండ్‌టేబుల్ సమావేశంలో నేతల డిమాండ్
- నేడు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చాలని, తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీసిటీ పరిధిలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో శనివారం జరిగిన పేలుడు యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని సిఐటియు నాయకులు అన్నారు. పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై తిరుపతి జిల్లాలో యశోదనగర్ వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడుతూ టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో జరిగిన పేలుడులో మృతి చెందిన ఐదుగురి కుటుంబాలకు టిల్ హెల్త్‌కేర్ యాజమాన్యం రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పర్రిశమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమను జనావాసాలకు దూరంగా తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు దశలవారీగా ఆందోళనలు కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. గతంలోనూ నాయుడుపేట ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఒక పరిశ్రమలో మూడుసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం, ఆస్తినష్టం, కార్మికులకు తీవ్ర గాయాలు సంభవించాయని గుర్తుచేశారు. శ్రీ సిటీ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎస్.జయచంద్ర అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, తిరుపతి నగర కార్యదర్శి బుజ్జి, నగర అధ్యక్షులు పార్ధసారథి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)