ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

2029 నాటికి పేదలందరికీ గృహవసతి

1 గంట క్రితం

2029 నాటికి పేదలందరికీ గృహవసతి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 12:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- బుర్రిపాలెం సభలో సిఎం చంద్రబాబు హామీ

- కేంద్ర మంత్రి శివరాజ్‌‌సింగ్‌ చౌహన్‌‌తో కలిసి
ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాశక్తి- గుంటూరు జిల్లాప్రతినిధి : పేదలకు సొంతిల్లు ఉంటే వారి జీవన ప్రమాణాలతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుందని, ​రాష్ర్టంలో 2029 నాటికి ఇల్లు లేని పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 3డీ టెక్నాలజీతో రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో కలిసి గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. బుర్రిపాలేనికి చెందిన లబ్ధిదారు లక్ష్మి కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం లక్ష్మి కుటుంబసభ్యులకు ‌నూతన వస్ర్తాలు బహూకరించడంతోపాటు ఇంటి పట్టాను చంద్రబాబు అందించారు. ఆధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న తొలి ఇల్లు మీదేనని వారికి భరోసా ఇచ్చారు. గృహ నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు బుర్రిపాలెంలో రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ ద్వారా 177 ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టును వారు సందర్శించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై రాష్ర్ట ప్రభుత్వంతో ఎంఒయు జరిగింది. ఎంఒయు పత్రాలను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల సమక్షంలో అధికారులు, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ ‌సంస్థ ప్రతినిధులు మార్చుకున్నారు. 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతతో తక్కువ సమయంలో, తక్కువ వ్యయంతో పటిష్టమైన ఇళ్లను నిర్మించవచ్చని అధికారులు వివరించారు. ఈ సాంకేతికతతో నిర్మించే ఇళ్లలో బయట వాతావరణంతో పోలిస్తే ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి సాధారణ కోటా కింద ఈ ఏడాది 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం మూడు లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలోగానే మరో మూడు లక్షల ఇళ్లను, వచ్చే ఏడాది మరో మూడు లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అంగీకరించారని తెలిపారు. మొత్తంగా తొమ్మిది లక్షల ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసేందుకు కేంద్రం సహకరిస్తోందన్నారు. 2019–24 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆరు లక్షల పేదల ఇళ్లను రద్దు చేసిందని, నివాసయోగ్యం కాని చెరువులు, గుట్టల్లో ఇంటి స్థలాలు ఇచ్చిందని విమర్శించారు.

షైనింగ్ ఆంధ్రా-అచీవింగ్ ఆంధ్రా : శివరాజ్ సింగ్ చౌహాన్

​కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలో రాష్ర్టం ఇక షైనింగ్ ఆంధ్రా, అడ్వాన్స్డ్ ఆంధ్రా, అచీవింగ్ ఆంధ్రాగా మారుతోందని కితాబిచ్చారు. 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ సాంకేతికతతో ఎపిలో చేపడుతున్న గృహ నిర్మాణం దేశానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌‌, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, రాష్ట్ర మంత్రులు కొలుసు పార్ధసారధి, నాదెండ్ల మనోహర్‌, బిజెపి రాష్ర్ట అధ్యక్షులు పివిఎన్‌‌ మాధవ్‌, కేంద్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి పియూష్‌ శ్రీవాస్తవ, ‌రాష్ర్ట గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ ‌సెక్రటరీ కొర్రపాటి హబ్సీకా రాణి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్