ప్రజాశక్తి–అమరావతి బ్యూరో : నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటివారినైనా ఎదిరించే ధైర్యం టంగుటూరి ప్రకాశం పంతులు నైజమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసం, పౌరుషానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని, సాహసోపేత పోరాటాన్ని స్మరించుకుంటూ నివాళులర్పించారు.
ధైర్యమే ఆయుధంగా.. ప్రజాసేవే లక్ష్యంగా..
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ప్రకాశం పంతులు దేశ స్వాతంత్య్రం కోసం ప్రదర్శించిన ధైర్యం, ప్రజల కోసం చేసిన త్యాగం, విలువల పట్ల చూపిన నిబద్ధత ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం ఆదర్శప్రాయమని ఆదివారం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.
తెలుగువారి ధైర్యానికి ప్రతీక
దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి తెలుగువారి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి ఆయన దృఢమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. ప్రకాశం పంతులు జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని ఆదివారం ఎక్స్ వేదికగా తెలిపారు. ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.








కామెంట్‌లు (0)