- బిసి గర్జన సభలో వైసిపి నేతలు
- 34 శాతం రిజర్వేషన్లపై తేల్చిచెప్పాలని డిమాండు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: రాష్ట్రంలో బిసిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, ఇచ్చిన హామీలు నెరవేర్చేకుండా ఎన్నికలకు వాడుకున్నారని వైసిపి బిసి నాయకులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం వైసిపి కేంద్ర కార్యాలయంలో బిసి గర్జన సభ జరిగింది. ఈ సభలో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, ఉషశ్రీ చరణ్, విడదల రజిని, జోగి రమేష్, బూడి ముత్యాలనాయుడు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకుడు మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెన్నుపోటు రాజకీయాలపై రీజనల్ స్థాయి నుంచి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సిఎం ఎప్పటికప్పుడు అబద్ధాలు చెబుతూ బిసిలను మోసం చేస్తున్నారని అన్నారు. బిసిలు వెన్నెముక అంటూనే ముంచేశారని విమర్శించారు. మోసపూరిత విధానాలను ప్రజలకు వివరించేందుకు రీజనల్, జిల్లా, మండల స్థాయిల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. చంద్రబాబు నాయుడు పాలనలో బిసిలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు కాలేదని పేర్కొన్నారు.
వైయస్సార్సీపీ ప్రభుత్వంలో డిబిటి ద్వారా రూ.1.70 లక్షల కోట్లు బిసి ఖాతాల్లో వేశారని వివరించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పేరుతో జీవో నంబర్ 105 ఇచ్చి చంద్రబాబు మరో పెద్ద డ్రామాకు తెరలేపారని అన్నారు. గతంలో వైయస్. జగన్మోహన్ రెడ్డి 34 శాతం రిజర్వేషన్ ఇస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్న ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా 34 శాతం రిజర్వేషన్ల పేరుతో బిసిలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారని తెలిపారు. స్థానిక సంస్థల్లో బిసిలకు నిజంగా 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. అమలు కాని జీవోలను అడ్డుపెట్టుకుని పాలాభిషేకాలు చేయించుకుంటూ బిసి సమాజాన్ని మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రశ్నించే బిసి నేతలపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, భౌతిక దాడులకు దిగుతోందని, కారుమూరి నాగేశ్వరరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, విడదల రజిని సహా పలువురు బిసి నేతలపై అక్రమ వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. రెడ్ బుక్ ఇప్పటికే డెడ్ బుక్ అయిపోయింది, త్వరలోనే డెత్ బుక్ కాబోతోందని తెలిపారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన మంత్రివర్గంలో బిసికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టడం తీవ్ర అవమానమని అన్నారు. మాజీ మంత్రులు విడదల రజని, ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ మేనిఫెస్టో హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం బిసిలను తీవ్రంగా వంచిస్తున్నారని అన్నారు. కూటమి 27 నెలల పాలనలో బిసిలకు ఇచ్చిన ఒక్క ప్రధాన హామీ కూడా అమలు కాలేదని అన్నారు.








కామెంట్‌లు (0)