శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిట్యాల ఐలమ్మ పోరాటమే వీర తెలంగాణ సాయుధ పోరాటానికి పునాది

26 నిమిషాల క్రితం

ch baburao.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 11:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు

ప్రజాశక్తి–ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : తెలంగాణ వీర సాయుధ పోరాటానికి, భూపోరాటాలకు చిట్యాల ఐలమ్మ దిశానిర్దేశం చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ కొనియాడారు. వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ గాంధీనగర్‌లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాన్య, బలహీన వర్గాల కుటుంబం నుంచి వచ్చిన ఐలమ్మకు ఎలాంటి చదువు లేకపోయినా భూస్వాములు, జమీందార్లు, నైజాం నవాబు అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారని గుర్తుచేశారు. ప్రజలను సమీకరించి ఆమె సాగించిన పోరాటం వీర తెలంగాణ సాయుధ పోరాటానికి బలమైన పునాది వేసిందన్నారు. కోట్లాది రూపాయల సంపద, ఉన్నత పదవులు అనుభవించిన వారిని కాలక్రమంలో ప్రజలు మర్చిపోతారని, అయితే ప్రజల కోసం నిలబడి పోరాడిన ఐలమ్మను నేటికీ ఆదర్శంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు పేదలు, బలహీన వర్గాల గొంతుకలను అణచివేస్తున్నాయని బాబురావు ఆరోపించారు. నాడు పోరాటాల ద్వారా పేదలు సాధించుకున్న భూములను నేటి పాలకులు వివిధ పేర్లతో స్వాధీనం చేసుకుని కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. పేదలకు సాగుభూమి, నివాస స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఐలమ్మ ఆశయాల బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. పేదల భూములను కాపాడుకోవడం, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పోరాడటమే ఐలమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. విజయవాడలో ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆమె త్యాగాలను నిత్యం గుర్తుచేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్‌, తూర్పు నియోజకవర్గ కార్యదర్శులు బి.రమణారావు, పి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్