క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వంతో విధులు నిర్వహించాలి
కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి ఎస్. సవిత
ప్రజాశక్తి–కడప అర్బన్ : “పోలీసు అంటే భయం కాదు.. ప్రజలకు భరోసా అనే భావన కలిగేలా విధులు నిర్వహించాలి. క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం పోలీసు విధుల్లో ఎంతో కీలకం” అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్.సవిత అన్నారు. భాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్ పరేడ్ మైదానంలో శనివారం 521 మంది నూతన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల సమస్యలను ఓపికగా విని మానవీయ దృక్పథంతో స్పందించాలని కోరారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానం, కొత్త చట్టాలపై నిరంతరం అవగాహన పెంచుకోవాలని సూచించారు.
కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ.. తొమ్మిది నెలల కఠిన శిక్షణ అనంతరం ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న కానిస్టేబుళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలీసు యూనిఫాం గౌరవంతో పాటు గొప్ప బాధ్యతను కూడా ఇస్తుందని, ప్రజలతో మర్యాదగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దారుఢ్యం, విధి నిర్వహణ నైపుణ్యాలను సేవలో కొనసాగించాలని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు మంత్రి, కలెక్టర్, ఎస్పీ పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో 11వ బెటాలియన్ కమాండెంట్ ఆనంద్‌రెడ్డి, కడప డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, పోలీసు అధికారులు, సిబ్బంది, నూతన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)