సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబరితెగించి అక్రమాలు

4 రోజుల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 11:47 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • వైసిపి గ్రూపు -1’పై సిఎం చంద్రబాబు

  • ప్రొఫెసర్లు చేయాల్సిన పనిని కార్మికుల చేత చేయించారని ఆరోపణ

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి హయంలో జరిగిన గ్రూప్‌-1 ‌పరీక్షల్లో బరితెగించి అక్రమాలకు పాల్పడ్డారని, అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 344 నిబంధన కింద చర్చలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఎపిపిఎస్‌‌సి గ్రూప్‌-1 పరీక్షలపై ఆయన శాసనసభలో బుధవారం సుదీర్ఘంగా మాట్లాడారు. పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని చెప్పారు.పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ ‌సర్వీస్ కమిషన్‌ (ఎపిపిఎస్‌‌సి) నియమాలు, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారన్నారు. మూల్యాంకన బాధ్యతలను ప్రయివేటు ఏజెన్సీకి ఇవ్వడం పెద్ద తప్పని చెప్పారు ప్రొఫెసర్లు చేయాల్సిన పనిని కార్మికుల చేత చేయించారని అన్నారు. గ్రూప్‌-1 ‌పరీక్షలపై నివేదికలు చూస్తే భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. గ్రూప్ 1 ఉద్యోగాల కోసం రాసిన పరీక్షలను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో ఎవాల్యుయేషన్ చేయించారని తెలిపారు. 66 మంది ఎవాల్యుయేటర్స్ అనధికారికంగా పరీక్ష పేపర్లు దిద్దారని తెలిపారు. డిజిటల్, ఆన్ లైన్ ఎవాల్యుయేషన్ కోసం నిబంధనల ప్రకారం ఎపిపిఎస్‌‌సి చైర్మన్ అనుమతి ఉండాలన, కానీ ఆయన్ను పూర్తిగా విస్మరించారని చెప్పారు. మాన్యువల్‌గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉండగా డిజిటల్‌గా చేశారన్నారు. ఎపిపిఎస్‌‌సి కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు తన క్లాస్ మేట్ శ్రీనివాస్‌కు అతడి బంధువు మహంకాళి రఘురామ్ కు ఈ పని అప్పగించారని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన వ్యక్తికే ఎపిపిఎస్‌‌సి కార్యదర్శి పదవి కట్టబెట్టారని చెప్పారు. పదో తరగతి పరీక్షలు జరిగితే జవాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్టుతో తరలిస్తామని అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారుల నియామకాలకు సంబంధించి పరీక్షలు నిర్వహణను అస్తవ్యస్తం చేశారన్నారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తూ అఫిడవిట్లు వేసి బరితెగించి ఇష్టానుసారంగా ప్రవర్తించారని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత సరిదిద్దుకోవాల్సింది పోయి హాయ్ లాండ్‌లో ఎవాల్యుయేషన్ కోసం రూ.1.19 కోట్లకు వ్యయం కోసం ఉత్తర్వులు ఇచ్చారని సిఎం గుర్తు చేశారు. పీడీఎఫ్ జవాబు పత్రాలు ప్రైవేటు జీ మెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సప్‌కు పంపించారని తెలిపారు.

ఎపిపిఎస్‌‌సికి కొత్త చైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాన్యువల్‌ ఎవాల్యుయేషన్‌కు ఆదేశాలు ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. 49 వేల డూప్లికేట్‌ ఓఎంఆర్‌ స్లిప్‌లు ముద్రించినట్లు చెప్పారు. జవాబు పత్రాల్లో వేర్వేరు రాతలు, మార్పులు, చేర్పులు, ఓవర్‌రైటింగ్‌లు గుర్తించారని తెలిపారు. 734 ఓఎంఆర్‌ స్లిప్‌లలో 718 స్లిప్‌లలో మార్పులు జరిగినట్లు వెల్లడించారు. 21 స్లిప్‌లపై ఎలాంటి సంతకాలు లేకపోవడం అక్రమాల తీవ్రతకు నిదర్శన మన్నారు. గ్రూప్‌–1 పరీక్ష రాసిన ఒక అభ్యర్థినే అదే పరీక్షకు ఎవాల్యుయేషన్‌ ఎగ్జామినర్‌గా నియమించడం మరింత దారుణమని సీఎం అన్నారు. ఎగ్జామినర్ల జాబితాలను వాట్సప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో పెట్టారని తెలిపారు. మూల్యాంకనం జరిగే హాల్లో 17 రోజుల పాటు సీసీ కెమెరాలు లేకపోవడం, మొబైల్‌ ఫోన్లను అనుమతించడం వంటి దారుణాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం వైటనర్‌ వినియోగించ కూడదని స్పష్టం చేస్తుండగా, ఓఎంఆర్‌ వాల్యుయేషన్‌ స్లిప్‌లలో వైటనర్‌ వినియోగించినట్లు ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ నివేదికలు వెల్లడించాయని చంద్రబాబు తెలిపారు. గ్రూపు-1 అక్రమాలు వెలుగుచూడటంతో ప్రజలను ఈ అంశాల నుంచి పక్కదారి పట్టించేందుకే పారదర్శకంగా జరిగిన డిఎస్‌‌సి నియామకాలపై బురద చల్లుతున్నారని అన్నారు.

గ్రూప్‌-1 అక్రమాలపై జెఎసి ఫ అసెంబ్లీలో ఎమ్మెల్యేల డిమాండ్‌

గ్రూప్‌-1 ‌పరీక్షల్లో జరిగిన అక్రమాలపై జాయింట్‌ ‌యాక్షన్ కమిటీ (జెఎసి) ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ ‌చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎపిపిఎస్‌‌సి గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనంపై అసెంబ్లీలో 344 నిబంధన కింద జరిగిన ప్రత్యేక చర్చలో కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడారు. భవిష్యత్‌‌లో అక్రమాలకు తావు లేకుండా ఎపిపిఎస్‌‌సిని తీర్చిదిద్దాలన్నారు. పరీక్షల్లో అక్రమాలపై ఉదాసీనతకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకరు అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసిపి నేత జగన్‌ ‌పాలనలో ఎపిపిఎస్‌‌సి వ్యవస్థను నాశనం చేశారని, గ్రూప్‌-1 ‌పరీక్షల్లో అక్రమాలకు తెరలేపారని ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్ ఆరోపించారు. వైసిపి ‌పాలనలో గ్రూప్‌-1 అక్రమాలపై జగన్‌ టీమ్‌.. ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే గౌతు శిరీష డిమాండ్ చేశారు. అక్రమాలు బహిర్గతమవుతాయనే పారదర్శకంగా జరిగిన డిఎస్‌‌సిపై వైసిపి నేతలు బుదర జల్లేందుకు పూనుకున్నారని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అన్నారు. ఒకసారి అధికారం ఇచ్చినందుకు ఎపిపిఎస్‌‌సిని జగన్‌ ‌భ్రష్టుపట్టించారని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రూప్‌-1 ‌పరీక్షలపై హైకోర్టు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సిట్‌ ‌నివేదిక జగన్‌ పాలనలో అక్రమాలకు పరాకాష్ట అని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. గ్రూప్‌-1 ‌పరీక్ష రాసిన వనజ అనే అధ్యాపకురాలు పేపర్లు దిద్దడం అక్రమాలకు పరాకాష్ట అని రెడ్డప్పగారి మాధవీరెడ్డి అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్