వైద్యశాలలో, ఉత్సవ నిర్వాహకులను విచారించిన జిల్లా వైద్యాధికారిణి, ఆర్డీవో
ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన ఘటన పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పట్టణానికి చెందిన ఒక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్సవం నిర్వహించారు. ఉత్సవంలో పాల్గొని ఆహారం తీసుకున్న అనంతరం పలువురు అస్వస్థత కు గురై స్థానిక ప్రకాశం రోడ్డులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందారు. ఈ విషయం బయటికి పొక్కడంతో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయలక్ష్మి, ఆర్డీవో కె శ్రీరమణి, కమిషనర్ జె రామ అప్పలనాయుడు, జిల్లా ఉప వైద్యాధికారిణి డాక్టర్ ఇ అన్నపూర్ణ సోమవారం ఉత్సవ కమిటీ నిర్వాహకులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వైద్యశాల రికార్డులను పరిశీలించారు. వైద్యుల ద్వారా సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ .... ఘటనపై నిర్వాహక సంస్థ బృందాన్ని విచారించామని అయితే ఆహారం కలుషితం అన్న దానిలో వాస్తవం లేదని వారు వెల్లడించారన్నారు. ఉత్సవాల సందర్భంగా ఉపవాసాలు, ఎండ తీవ్రత, ఊరేగింపులో నృత్యాలు, నడక కారణంగా అస్వస్థతకు గురైనట్లు చెప్పారని, ఆసుపత్రి రికార్డులను కూడా పరిశీలిస్తే ఆదివారం రాత్రి 15 మంది ఔట్ పేషెంట్స్ గా చికిత్స పొందారని, సోమవారం మరో మహిళ చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారన్నారు. డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ .... ఆసుపత్రిలో చికిత్స పొందిన వారి వివరాలు సేకరించామని, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని, ఇంటింటి సర్వే కూడా నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఎవరికి ప్రాణాపాయం లేదని, చికిత్స పొందుతున్న మహిళ కూడా వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఏం జరిగిందన్నది కూడా పూర్తిగా విచారిస్తామన్నారు. వారి వెంట రెవెన్యూ, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు.








కామెంట్‌లు (0)