గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపొగాకు కంపెనీల తీరుపై సిఎం అసంతృప్తి

15 గంటల క్రితం

cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఇండెంట్‌ ప్రకారం కొనాల్సిందేనని ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పొగాకు కొనుగోళ్ల విషయంలో కంపెనీల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా అతిపెద్ద మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలైన ఐటిసి, గాడ్ ఫ్రే ఫిలిప్స్ (ఐ), విఎస్‌‌టి ఇండస్ట్రీస్ 95.50 మిలియన్ కేజీల పంట కొనుగోళ్లకు ఇండెంట్ ఇవ్వగా.. ఇప్పటి వరకు కేవలం 17.6 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సీజన్లో ఐదోసారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. పొగాకు కొనుగోళ్లు పెద్దయెత్తున జరపాలని, ఇందుకు వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్ణాటకలో తలెత్తని సమస్య రాష్ట్రంలో ఎందుకు ఉత్పన్నమవుతోందని ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టేలా నడుచుకుని కంపెనీలు గుడ్ విల్ పోగొట్టుకోవద్దని, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే, తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో పరిశీలించారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలోకు రూ.200 తగ్గకుండా, మొత్తం కొనుగోళ్లు జరిపి తీరాలన్నారు. రైతులు డిమాండ్‌కు మించి పొగాకు సాగుచేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ముఖ్యమంత్రికి ట్రేడర్లు వివరించారు. ఇప్పటికే అవసరానికి మించి కొనుగోళ్లు చేశామని, దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కొనుగోళ్లు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. పొగాకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేశాయని అధికారులు వివరించారు. అలాగే కంపెనీలు 142 మిలియన్ కేజీలకు ఇండెంట్ ఇవ్వగా, రైతులు 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్