- సిపిఎం ధ్వజం
- చట్ట సవరణ 44/2020, జీవో 198 రద్దు చేయాలి
- దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవాడ ప్రజల నుండి భారీగా మంచినీటి ఛార్జీలు వసూలు
ప్రజాశక్తి- ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని టిడిపి, బిజెపి, జనసేన కూటమి ప్రభుత్వం పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఘోరమైన నమ్మకద్రోహానికి పాల్పడిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబురావు, మాజీ కార్పొరేటర్ సత్యబాబులు తీవ్రస్థాయిలో ద్వాజమెత్తరు. విజయవాడలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆకాశమంత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు, ఇప్పుడు పట్టణ ప్రజల నడ్డి విరుస్తూ పన్నుల భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరుస్తూ, ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
అప్పుడు వ్యతిరేకించి.. ఇప్పుడు ఆమోదిస్తారా?
రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని దాదాపు 1.50 కోట్ల మంది పట్టణ ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు. గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాకంటక ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానాన్ని చట్ట సవరణ 44/2020, జీవో 198 లను నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ, నేడు అధికారంలోకి రాగానే అదే పన్నుల పెంపును యథాతథంగా కొనసాగించడం లజ్జాకరమని ఆరోపించారు. గత మూడేళ్లలో రూ.1,000 కోట్ల ఇంటి పన్నుల భారం వేయగా, ఈ ఏడాది ఏప్రిల్ నుండి మరో ₹400 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై మోపారని దుయ్యబట్టారు. గత ఆరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఇంటి పన్నులు ఏకంగా 131 శాతం పెరగడం పాలకుల దోపిడీకి నిదర్శనమని గణాంకాలతో సహా ఎండగట్టారు.
దొడ్డిదారిన 'యూజర్ ఛార్జీల' బాదుడు..
పైకి చెత్త పన్నును రద్దు చేశామని ప్రగల్భాలు పలుకుతున్న ప్రభుత్వం, లోపాయికారీగా జీవో 673 ద్వారా 'యూజర్ ఛార్జీల' పేరుతో దొడ్డిదారిన మళ్లీ చెత్త పన్ను వసూలు చేసేందుకు కుట్ర పన్నిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు ముగియగానే ఈ వసూళ్లను అధికారికంగా ప్రజలపై రుద్దడానికి రంగం సిద్ధం చేశారని హెచ్చరించారు. అంతేకాకుండా, జీవో 196, 197లను రద్దు చేయకుండా ఇళ్లలోని మరుగుదొడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లపై ప్రతి నెలా రుసుములు వసూలు చేస్తూ సామాన్యుడి రక్తాన్ని పిండుతున్నారని మండిపడ్డారు. పన్ను చెల్లింపుల్లో స్వల్ప ఆలస్యమైనా 24 శాతం వడ్డీ, పెనాల్టీలు వసూలు చేస్తున్నారని, కనీసం పట్టాలు లేని పేదల ఇళ్లకు, ప్లాన్‌కు భిన్నంగా ఉన్న నిర్మాణాలకు 25 శాతం నుండి 100 శాతం వరకు అదనపు పెనాల్టీలు విధిస్తూ కార్పొరేషన్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్ల ప్రైవేటీకరణ.. కృష్ణా తీరాన నీటి దోపిడీ..
విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో అంతర్గత రోడ్లను పిపిపి విధానంలో ప్రైవేటీకరిస్తూ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, విజయవాడలో ఇప్పటికే 20 ప్రధాన అంతర్గత రోడ్లను టెండర్లు పిలవడం దారుణమన్నారు. నగరానికి ఆనుకునే కృష్ణా నది ప్రవహిస్తున్నప్పటికీ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవాడ ప్రజల నుండి భారీగా మంచినీటి ఛార్జీలు వసూలు చేయడం పాలకుల చేతకానితనానికి పరాకాష్ట అని తెలిపారు.
పాలకులారా జవాబు చెప్పండి, సిపిఎం డిమాండ్లు..
ఇంటి పన్నులు విచ్చలవిడిగా పెంచేందుకు కారణమైన జీవో 198, చట్ట సవరణ 44/2020 ని తక్షణమే రద్దు చేయాలన్నారు. యూజర్ ఛార్జీలు, చెత్త పన్ను పునరుద్ధరణ కోసం తెచ్చిన జీవో 673 తో పాటు 196, 197 జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పట్టణ ప్రజలకు ఇచ్చిన అన్ని ఎన్నికల హామీలను నెరవేర్చి, ఆ తర్వాతే కూటమి నాయకులు ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలను పన్నుల పేరుతో పీల్చి పిప్పి చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ ఏకం చేసి, సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని నేతలు స్పష్టం చేశారు.







కామెంట్‌లు (0)