- సామాజిక శంఖారావం బృందం డిమాండ్
ప్రజాశక్తి-అమలాపురం రూరల్ : సామాజిక శంఖారావం బృందం నిర్వహించిన సర్వేలో తాండవపల్లి, ఉప్పుచెరువు, మన్నానగర్ కాలనీల్లో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని తీవ్రమైన సామాజిక, మౌలిక వసతుల సమస్యలను ప్రజలు బృందం దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం ఆయా గ్రామాల్లో సర్వే బృందం స్థానిక ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించింది.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేక బతుకుదెరువు కోసం పెయింటింగ్, హోటల్ పనులకు, ఆక్వా చెరువుల వద్ద కూలి పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆపద సమయాల్లో అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ ఇక్కట్ల పాలవుతున్నామని, ఉప్పుచెరువు గ్రామంలో ప్రైవేట్ బ్యాంకులకు వడ్డీలు కట్టలేదనే కారణంతో రెండు కుటుంబాల ఇళ్లను స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రుణమాఫీ ద్వారా ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.డ్వాక్రా మహిళల వద్ద బ్యాంకులు అధిక వడ్డీలు వసూలు చేయడాన్ని తక్షణమే అరికట్టాలని, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే స్థానిక స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో చుట్టూ ఆక్వా చెరువులు ఉండటం వల్ల స్థానిక మహిళలకు పనులు దొరకడం లేదని, తక్షణమే ఉపాధి హామీ పనులు కల్పించి, ఏడాదికి 200 రోజుల పని దినాలతో పాటు రోజువారీ కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో వెంటనే కమ్యూనిటీ హాలు నిర్మాణం చేపట్టాలని కోరారు.ఈ సమస్యలపై స్థానిక అధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని యెడల గ్రామస్తులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కారెం వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా నాయకురాలు అమూల్య, స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరమట వరలక్ష్మి, కందికట్ల అమ్మాజీ, జల్లి దమయంతి, మంగం కుమారి, మాకే రాని, మోసిగంట బాలవేణి,పొలమూరు నాగమణి, పొలమూరు వెంకటలక్ష్మి, వేముల బేబీ, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)