- విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
- ప్రధాని చేతులమీదుగా ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్ వర్చువల్ గా ప్రారంభం
ప్రజాశక్తి మంగళగిరి : దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలకపాత్ర అని, రైల్వే స్టేషన్ల ద్వారా ఆర్థికాభివృద్ధి జరగాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' కింద ₹12.56 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలో అనేక సంస్థలు ఉన్నాయి. కేవలం ఒకే సంస్థ మొత్తం భారతదేశాన్ని కలుపుతోంది. అదే మన రైల్వే సంస్థ. మన జీవిత ప్రయాణంలో ఎప్పుడో ఒకప్పుడు రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై వేచి చూసి ఉంటారు, రైలు కిటికీలోంచి బయటకు చూసి ఉంటారు లేదా భారతీయ రైల్వేలో ఒక ముఖ్యమైన ప్రయాణం చేసి ఉంటారు. అందుకే భారతీయ రైల్వే కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అది భారతదేశ జాతీయ సమైక్యత, సమగ్రతకు ఒకగొప్ప సాధనం. దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలకపాత్ర. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ గారు రైల్వే వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గతంలో దశాబ్దాల తరబడి భారతీయ రైల్వేలు రద్దీగా ఉండే స్టేషన్లు, ఆలస్యమయ్యే రైళ్లు, పాతబడిన మౌలిక సదుపాయాలకు మారుపేరుగా ఉండేవి. నేడు, ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు... వందే భారత్, బుల్లెట్ రైళ్లు, 'కవచ్' భద్రతా సాంకేతికత, 100% విద్యుదీకరణ, ఆధునిక సరుకు రవాణా కారిడార్లు, ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు, హైడ్రోజన్ ఆధారిత రైళ్ల గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇది సాధారణ ఆధునీకరణ మాత్రమే కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలో జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇది. ఇది ఒక రైల్వే విప్లవం. దేశం అభివృద్ధి చెందాలంటే రైల్వేలు అభివృద్ధి చెందాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని అన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ గారి దార్శనికతతో, భారతీయ రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ఆధునీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. వేలాది కిలోమీటర్ల నూతన రైల్వే లైన్లను నిర్మిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్, గతిశక్తి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ కే.సైమన్, సీనియర్ డీసీఎం డా.సీహెచ్ ప్రదీప్ కుమార్, సీనియర్ డీపీవో కేప్రియల్ అరోర, సీఎంఎస్ కే.శ్రీనివాసులు, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, రూరల్ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని అనిత పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)