- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
- పటిష్టంగా జిల్లాలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు
- సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఎన్‌నినోపై సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలను క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి జిల్లా కలెక్టర్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ, అధిక ప్రమాద మండలాలు, రైతు సేవా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి జూలై 15 వరకు సాధారణంతో పోలిస్తే 48.3 శాతం వర్షపాతం లోటు నమోదైందని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ వివరించారు. 24 జిల్లాలు లోటు వర్షపాతం, నాలుగు జిల్లాలు తీవ్ర లోటు వర్షపాతం కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. 8,489 రైతు సేవా కేంద్రాల్లో 1,357 అధిక ప్రమాదం, 2,077 మోస్తరు ప్రమాదం, 5,055 తక్కువ ప్రమాదంగా గుర్తించగా, రాయలసీమ జిల్లాలు అత్యధిక ప్రమాద ప్రాంతాలుగా ఉన్నట్లు వివరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగును విస్తృతంగా ప్రోత్సహించడంతో పాటు, అత్యవసర పరిస్థితులకు అవసరమైన విత్తనాలను ముందుగానే జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని సిఎస్ సాయిప్రసాద్ సూచించారు. వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, తక్కువ నీటితో సాగు చేసే పంటలను మరింత విస్తరించాలని పేర్కొన్నారు. మిర్చి, ఉల్లి, కూరగాయలు, మామిడి, నారింజ, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు అధిక ప్రమాదం ఉందని ఉద్యానవన శాఖ కమీషనర్ శ్రీనివాసులు వివరించారు. డ్రిప్ ఇరిగేషన్‌ను విస్తృతంగా అమలు చేయాలని, ఫార్మ్‌పాండ్లు, మల్చింగ్, షేడ్‌నెట్లు, సూక్ష్మపోషకాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సిఎస్ ఆదేశించారు. ఉద్యానవన పంటలకు అవసరమైన కీలక దశల్లో నీటి పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని, పురుగులు, తెగుళ్లపై వారానికోసారి పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రైతులకు క్షేత్రస్థాయిలో సాంకేతిక మార్గదర్శకత్వం అందించడంతో పాటు భవిష్యత్తులో ఏర్పడే నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ఉద్యాన పంటలకు జీవనాధార నీటిపారుదల ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో పశుగ్రాసం, తాగునీటి లభ్యత అత్యంత కీలకమని, పిఎండిఎస్ ద్వారా పశుగ్రాస ఉత్పత్తిని పెంచాలని చెప్పారు. పంట అవశేషాలను పశుగ్రాసంగా వినియోగించే విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి మండలంలో పశు శిబిరాలు ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. పశువుల బలవంతపు అమ్మకాలు జరగకుండా శాండీలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, నీటి వనరుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.ఆక్వా, మత్స్యరంగంపై ఎల్‌నినో ప్రభావాన్ని నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఎల్‌నినో పరిస్థితులు మరో కొన్ని నెలలు కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి చర్యను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్య, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల తదితర శాఖలు సమిష్టిగా పనిచేస్తే రైతులకు కలిగే నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, ఆర్‌టిజిఎస్ సిఇవో ప్రఖర్ జైన్, వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలాని సమూన్, రైతు సాధికార సంస్థ సిఇఒ బి రామారావు, మత్స్యశాఖ కమీషనర్ రామశంకర్ నాయక్, పశు సంవర్థక శాఖ సంచాలకులు దామోదర నాయుడు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)