మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకేన్సర్‌‌ నివారణకు సమగ్ర చర్యలు

50 నిమిషాల క్రితం

satyakumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 11:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

  • గుంటూరులో జీనోమిక్‌ సీక్వెన్సింగ్‌ సెంటర్‌ ప్రారంభం

ప్రజాశక్తి-గుంటూరు : కేన్సర్‌‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, నివారణ, చికిత్స అందించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ అమలు చేస్తోందని రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ‌యాదవ్‌ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ఆస్ర్టాజెనెకా, స్టాండ్‌‌లైఫ్‌ ‌సైన్సెస్‌, క్యూర్‌ ఎఐ సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ ‌జీనోమిక్‌ ‌సీక్వెన్సింగ్‌ ‌సెంటర్‌‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ జన్యు పరీక్షల కోసం నమూనాలను బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు పంపాల్సి వచ్చేదని, గుంటూరులో జీనోమిక్ సెంటర్ ఏర్పాటుతో స్థానికంగానే పరీక్షలు నిర్వహించే అవకాశం ఏర్పడిందన్నారు. రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చయ్యే జన్యు పరీక్షలను ఉచితంగా అందించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జీనోమిక్‌ ‌సీక్వెన్సింగ్‌ ‌ద్వారా జన్యుపరమైన వ్యాధులను ముందుగానే గుర్తించటంతోపాటు, భవిష్యత్‌‌లో కేన్సర్‌ ‌వచ్చే అవకాశాలను అంచనా వేసి, తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. దేశంలో కేన్సర్‌ ‌కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని, అందువల్ల కేన్సర్‌‌ను కేవలం చికిత్సకు పరిమితం చేయకుండా ముందస్తు గుర్తింపు, నివారణ, మాలిక్యులర్ డయాగ్నోసిస్‌, జీనోమిక్స్‌, క్లినికల్‌ ‌రీసెర్చ్‌, వ్యక్తిగత చికిత్స అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ర్టంలో ఓరల్‌, బ్రెస్ట్‌, సర్వైకల్‌ ‌కేన్సర్లకు ఉచితంగా స్క్రీనింగ్‌ ‌పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 2.65 కోట్ల మందికి స్ర్కీనింగ్‌ ‌పరీక్షలు జరిపామని, అనుమానిత కేసులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తదుపరి చికిత్స అందిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలులో రూ.120 కోట్లతో సెంట్రల్ స్టేట్ కేన్సర్ సెంటర్‌ను ప్రారంభించామని, కడప, విశాఖపట్నంలో సమగ్ర కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది అనంతపురం, కాకినాడలో కూడా కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో సమగ్ర కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ సెక్రటరీ జి. వీరపాండియన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్