మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఓటర్లకు యాంత్రికంగా నోటీసులా?

49 నిమిషాల క్రితం

supreem
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 12:26 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఢిల్లీ ఎస్‌ఐఆర్‌పై ఇసి తీరును ప్రశ్నించిన సుప్రీంకోర్టు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసుల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘లాజికల్‌ డిస్క్రెపెన్సీ’ పేరుతో కొందరు ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ, అందులో ఏ అంశంపై వివరణ ఇవ్వాలో స్పష్టంగా పేర్కొనకపోవడాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కొన్ని నోటీసులు యాంత్రికంగా, బహుశా కంప్యూటర్‌తో రూపొందించి జారీ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ఎస్ఐఆర్ నోటీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ల‌ను మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఓటర్లను ‘డౌట్‌ఫుల్‌’ జాబితాలో చేర్చి, వారి గత రికార్డుల్లో తేడాలు ఉన్నాయంటూ ఇసి నోటీసులు ఇస్తున్న తీరుపై పిటిషన్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం, వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొంది.

ఏమి వివరించాలో చెప్పాలి’

‘లాజికల్‌ డిస్క్రెపెన్సీ’ అంటే ఏమిటో ఓటర్లకు స్పష్టంగా తెలియజేయాలని సిజెఐ సూచించారు. ఒక వ్యక్తి గతంలో మరో రాష్ట్రంలో ఓటు వేసి, అనంతరం ఢిల్లీకి వచ్చి ఉంటే.. ఆయ‌న‌ ఓటింగ్‌ వివరాల్లో ఏ అంశంపై వివరణ కోరుతున్నారో నోటీసులో స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. ‘ఢిల్లీ లేదా మరెక్కడైనా ఓటు వేశారా? స్పష్టం చేయండి’ అని అడగడం మాత్రమే కాకుండా, ఏ విషయాన్ని స్పష్టం చేయాలో ఓటరుకు అర్థమయ్యే విధంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లకు బూత్‌ లెవల్‌ అధికారులు (బిఎల్‌ఓలు) మరింత సహకరించాలని సుప్రీంకోర్టు సూచించింది. పాత ఓటర్ల జాబితాల్లో పేర్లు ఉన్నాయా, ఏ ధ్రువపత్రాలు అందుబాటులో ఉన్నాయి వంటి అంశాలపై బిఎల్ఒలు ప్రజలకు వివరించగలిగితే ప్రక్రియ సులభమవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ఓటర్లకు ఎదురయ్యే సాధారణ సందేహాలపై ఎన్నికల సంఘం తరచూ అడిగే ప్రశ్నలు - సమాధానాల జాబితాను రూపొందించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. దాన్ని పత్రికలు, వెబ్‌సైట్లు, స్థానిక సంస్థలు, బిఎల్ఒతో ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిజెఐ సూచించారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

33 లక్షల మందికి నోటీసులపై ఆందోళన

పిటిషనర్ తరపున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్ వాద‌న‌లు వినిపిస్తూ ఢిల్లీలో సుమారు 33 లక్షల మందికి నోటీసులు జారీ చేశారని తెలిపారు. రోజువారీ కూలీలు, సామాన్య ప్రజలు ఇలాంటి నోటీసులకు ఎలా స్పందించగలరని ప్రశ్నించారు. నోటీసుల్లో తగిన కారణాలు, తదుపరి తీసుకోవాల్సిన చర్యలు స్పష్టంగా ఉండటం లేదని వాదించారు. తల్లిదండ్రులు - పిల్లల వయసు మధ్య తేడా తక్కువగా ఉందని ‘లాజికల్‌ డిస్క్రెపెన్సీ’గా చూపితే, దాన్ని నిరూపించడానికి ఓటర్లు ఎలాంటి పత్రాలు సమర్పించాలో స్పష్టత లేదని ఆయన ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సంఘం సూచిస్తున్న 12 రకాల పత్రాల్లో ఇలాంటి విషయాలను నిరూపించే సమాచారం లేద‌ని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదిస్తూ ప్రతి ఎస్‌ఐఆర్‌ నోటీసులో కారణం పేర్కొంటున్నామని తెలిపారు. ‘ఒక్క ఓటరును కూడా విచారణ లేకుండా తొలగించం’ అని అన్నారు. నోటీసుల్లో బిఎల్ఒల‌ను సంప్రదించేందుకు వారి పేరు, మొబైల్‌ నంబర్‌ వంటి వివరాలు ఇస్తున్నామని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పెండింగ్‌ను తగ్గించేందుకు సిబ్బందిని పెంచుతున్నామని చెప్పారు. ప్రభావిత ఓటర్లకు అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం, ప్రత్యక్ష సహాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. ఢిల్లీలో సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేనందున ప్రక్రియలో తలెత్తిన లోపాలను సరిదిద్దేందుకు సమయం ఉందని ధర్మాసనం పేర్కొంది. ఇసి నుంచి తక్షణం తీసుకున్న చర్యల వివరాలను కూడా తమ ముందుంచాలని ఆదేశించింది. అనంత‌రం కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్