చీకటి గోపి లాకప్ డెత్‌పై దళిత, గిరిజన, ప్రజా సంఘాల డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి (30) పోలీసుల అదుపులో మరణించిన ఘటనపై రీ పోస్ట్‌మార్టం నిర్వహించి, న్యాయ విచారణ జరిపించాలని దళిత, గిరిజన, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనపై రాష్ట్ర ఎస్‌సి కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహర్‌ను విజయవాడలో మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశాయి. ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి మాట్లాడుతూ.. గోపి మరణానికి కారణాలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, బాధ్యులైన తాడికొండ పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని కోరారు. దొంగతనం నెపంతో గోపిని తాడికొండ పోలీసులు అదుపులోకి తీసుకుని మూడు రోజులపాటు నిర్బంధించారని, ఈ క్రమంలో ఆయనను చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మరణించిన నేపథ్యంలో సాధారణ మరణంగా పరిగణించ కుండా సమగ్ర విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గోపి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి, లక్ష్మణ నాయుడు హత్య ఘటనలపై ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించిందని తెలిపారు.
అలాగే దళితులు హత్యకు గురైనప్పుడు, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చీకటి గోపి మరణం విషయంలోనూ ప్రభుత్వం అదే స్థాయిలో తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు, పోలీసు వేధింపులపై సమగ్ర పరిశీలన జరిపి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ.. గోపి కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత, గిరిజన, ప్రజా సంఘాల పోరాటం కొనసాగుతుందని తెలిపారు. గోపి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, దళితులపై దాడులకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌జె విద్యాసాగర్, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్, ఎంఆర్‌పిఎస్ జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు తదితరులు వినతిపత్రం అందజేసిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై ఎస్‌సి కమిషన్ ఛైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడుతూ.. ఘటనపై సిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన వెంటనే ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తన పరిధిలో బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.







కామెంట్‌లు (0)