- వైద్య,ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : 'సంజీవని' కార్యక్రమంతో 'ఇంటింటికీ యోగా'ను అనుసంధానం చేయబోతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 'ఇంటింటికీ యోగా-సంజీవని ప్రాజెక్టు-ఆయుష్ సేవల అనుసంధానం భాగస్వామ్య సంస్థల సహకారం’ అనే అంశంపై శుక్రవారం మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ప్రతి ఇంటిలో యోగా-ఆరోగ్యకర కుటుంబం-ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధుల విషయంలో జీవనశైలి, ఆహారం, ముందస్తు జాగ్రత్తలపై చిన్న చిన్న తెలుగు వీడియోలను అందించవచ్చునని తెలిపారు. గర్భిణులు, బాలింతలకు వారి అవసరానికి తగిన సమాచారం, ఒత్తిడి, నిద్ర, మనసు–శరీర ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు అందించే అవకాశం ఉందని చెప్పారు. ఇంట్లోనే యోగా నేర్చుకునే అవకాశం కల్పించడం ‘ఇంటింటికీ యోగా’లో ముఖ్యమైన అంశంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో వీడియోలను చూసి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలను సాధన చేసుకునేలా చేయవచ్చునని, దీనివల్ల యోగా ఒక ప్రత్యేక కార్యక్రమంగా కాకుండా రోజువారీ ఆరోగ్య అలవాటుగా మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.'ఆయుష్ వైద్య సేవలను కూడా సంజీవనిలో అనుసంధానం చేయబోతున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ మాట్లాడుతూ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తే ఆర్థిక భారం కూడా తగ్గుతుందని అన్నారు. ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ యోగాను 365 రోజులు ప్రజా ఉద్యమంగా మార్చాలని తెలిపారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ అరుణ్‌బాబు, ఏపీ ఎయిడ్స్ నియంత్రణా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ స్మరణ్ రాజు, ఎన్టీఆర్ ట్రస్ట్ సిఈఓ పద్మావతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)