ఆగస్టు 9 లోగా సమస్యలు పరిష్కరించకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం
జిఒ 3కు చట్టబద్ధత కల్పించాలి : కిలో సురేంద్ర
ప్రజాశక్తి-పార్వతీపురం : గిరిజన చట్టాల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, హక్కులను గాలికొదిలేసి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీ ముందు మోకరిల్లుతున్నాయని విమర్శించారు. జిఒ నంబర్3ను పునరుద్దరించాలని, సవర భాష విద్యా వలంటీర్లను రెన్యువల్ చేసి జీతాలు పెంచాలని, జాతాపు భాష విద్యా వలంటీర్లను నియమించాలని, గిరిజనులు అధికంగా నివసిస్తున్న గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన మంగళవారం పార్వతీపురం ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేశారు. ఈ ఆందోళనకు ఎస్ఎఫ్ఐ, ఐద్వా, యుటిఎఫ్, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు ప్రకటించాయి. గిరిజన సంఘం జిల్లా నాయకులు లక్ష్మణరావు అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో లోకనాథం మాట్లాడుతూ... టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా గిరిజనులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. జిఒ నంబర్ 3కు ప్రత్యామ్నాయంగా మెరుగైన జిఒ తీసుకొస్తామని గత ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చాక జిఒ సంగతే మరిచిపోయారని విమర్శించారు. ఈ జిఒ లేకపోవడంతో గిరిజన యువతీ యువకులు ఉద్యోగావకాశాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ తాగునీటి సరఫరా, విద్యుత్, రహదారులు లేని గ్రామాలు చాలా ఉన్నాయని, గిరిజనులను ఉద్దరిస్తానని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కపట ప్రేమ కనబరుస్తున్నారని, రెండేళ్లలో ఆయన చేసిందేమీ లేదన్నారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో అంబాని, అదాని కంపెనీలకు వందల ఎకరాల భూములు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెట్టే యత్నం చేస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. క్రైస్తవ గిరిజనులు ఆదివాసీలు కాదనే వాదనను తెరపైకి తీసుకొచ్చి ఐక్యత దెబ్బతీసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనులు ఐక్యంగా ఉండాలని కోరారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం లోగా గిరిజన సమస్యలు పరిష్కరించకపోతే ఆగష్టు 16నుంచి ఎమ్మెల్యేలు, ఎంపిల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ... జిఒ నంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. సవర, జాతాపు తెగల గిరిజనులకు వారి మాతృభాషలో బోధన చేయాలని రాజ్యాంగం చెపుతున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. సవర భాషా వలంటీర్లకు ఏళ్ల తరబడి ఐదు వేల రూపాయలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాయని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని వివరించారు. సమస్యల పరిష్కారానికి గిరిజనులు ఐక్య పోరాటానికి సిద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకులు రామస్వామి, తిరుపతి రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి కె.గంగు నాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మీ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బంటు దాసు తదితరులు పాల్గొన్నారు .








కామెంట్‌లు (0)