- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : అసెంబ్లీ, సచివాలయంలో పనిచేసే హౌస్ కీపింగ్ కార్మికులకు జీతాలు పెంపుకోసం సమ్మె అనివార్యమని, ఈ మేరకు 30న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. అసెంబ్లీ, సచివాలయంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని అసెంబ్లీ, సచివాలయం హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో శనివారం రాజధానిలోని మల్కాపురం సెంటర్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2019లో హౌస్ కీపింగ్ కార్మికులకు వేతనాలు పెంచారని, ఏడేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు, రాజధాని ప్రాంతంలో ఇంటి అద్దెలు, ఇతర అన్ని రకాల ఖర్చులు పెద్ద ఎత్తున పెరిగాయని కార్మికుల వేతనం మాత్రం పెరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో పనిచేస్తున్న మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లో పారిశుధ్య కార్మికులకు మాదిరిగానే రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీతాల పెంపు కోసం ఇప్పటికే మంత్రి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రెటరీ కె.సురేష్ కుమార్, సిఆర్‌డిఎ కమిషనర్ విజయరామరాజును కలిసి సమస్య తెలియజేయగా సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. రాజధాని ప్రాంతంలో పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఎకరం 99 పైసలకే ఇస్తున్న పాలకులు కార్మికుల వేతనాలు మాత్రం పెంచడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని నిలదీశారు. సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవి, బి.లక్ష్మణరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె.గ్రేస్, సుజాత, బుజ్జి, బుల్లమ్మాయి, ఇందిరా, పుష్ప, కోటేశ్వరి, అమ్ములు, భవ్య, చిట్టిబాబు, వీరయ్య, ఏసుబాబు, మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)