- అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి : హైకోర్టు
ప్రజాశక్తి-అమరావతి : విజయవాడ సమీపంలోని బుడమేరు వాగు పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్రమ నిర్మాణాలపై నిరంతరం నిఘా ఉంచాలని, ఎక్కడైనా నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే స్పందించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలకు విద్యుత్, నీటి కనెక్షన్లు ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బుడమేరు వరదల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టు ఎన్ భూపతిరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతోపాటు, కాలువలు, నదులు, వాగులు, ఇతర నీటి వనరుల భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని కోరుతూ సామాజిక కార్యకర్త పర్వతనేని హరికృష్ణ దాఖలు చేసిన మరో వ్యాజ్యాన్ని డివిజన్ బెంచ్ విచారించింది. ఆక్రమణల నివారణతోపాటు ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు సంబంధిత శాఖాధిపతులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది యతీంద్రదేవ్ తెలిపారు. ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టరు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారని వివరించారు. విచారణ నవంబరు 18కి వాయిదా పడింది.








కామెంట్‌లు (0)