మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎస్‌‌టి గురుకుల ఉపాధ్యాయుల పొట్టగొట్టొద్దు

2 గంటల క్రితం

dharna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 10:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 12వ రోజుకు నిరసన - ప్రజాసంఘాల మద్దతు

ప్రజాశక్తి - తాడేపల్లి (గుంటూరు జిల్లా) : గిరిజన గురుకుల ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఐద్వా జాతీయ నాయకులు డి.రమాదేవి డిమాండ్‌ ‌చేశారు. తొలగించిన 668 మంది గురుకుల ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్‌లోని రాష్ట్ర గిరిజన గురుకుల ప్రధాన కార్యాలయం వద్ద 12 రోజులుగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన చేయగా, ఉపాధ్యాయినులు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. పలువురు ఉపాధ్యాయినులు తమ బిడ్డలను చంకలో ఎత్తుకుని మరీ వచ్చి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రమాదేవితో పాటు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం, ప్రయివేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎం.సూర్యారావు, గిరిజన ఉద్యోగుల సంఘం ఎస్‌‌టి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి డి.ప్రభాకర్, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బారావు ఆందోళనకు మద్దతు తెలిపి మాట్లాడారు. గతంలో ప్రకటించిన డిఎస్‌‌సిలో గిరిజన టీచర్లకు వెయిటేజ్ కోసం 45 రోజులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ఉపాధ్యాయుల పొట్టలు కొట్టి వారికి అన్యాయం చేయొద్దని, వారి ఆందోళనపై సత్వరమే స్పందించాలని డిమాండ్‌ ‌చేశారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వి.అశోక్, అఖిలభారత బంజారా సేవా సంఘం జిల్లా నాయకులు బాలాజీ నాయక్, సిఐటియు నాయకులు బి.వెంకటేశ్వర్లు, పి.కృష్ణ, డివి భాస్కర్‌రెడ్డి, వై.బర్నబాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్