మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విదేశాల్లో స్థిరపడి ఎంత ఎదిగినా ప్రవాస తెలుగువారు తమ మూలాలను, భాషా సంస్కృతులను మరువొద్దని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. మలేషియాలోని పెనాంగ్‌లో నిర్వహించిన ‘ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్’ (ఎపిటిఎఫ్) సదస్సు ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా తదితర దేశాల్లోని తెలుగు సంఘాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎపిటిఎఫ్ ఏర్పాటు కావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. తెలుగు యువత గ్లోబల్ సిటిజన్లుగా ఎదుగుతూనే తెలుగు జాతిగా ఒక్కటిగా ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని కోరారు. తెలుగు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉపాధి కల్పించాలని, ప్రవాసుల సమస్యల పరిష్కారానికి, వారి నైపుణ్యాలను రాష్ర్టాభివృద్ధితో అనుసంధానించేందుకు ఎపిఎన్‌ఆర్‌టిఎస్ బలమైన వారధిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా యువ మలేషియా తెలుగు కళాకారులు ప్రదర్శించిన ఉత్తరాంధ్ర శైలి కోలాట భజన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్ తాత్కాలిక అధ్యక్షులు ఎస్ వెంకట ప్రతాప్, నిర్వహణ కమిటీ ఛైర్మన్ సత్య సుధాకరన్, ప్రధాన కార్యదర్శి శివ సూర్య నారాయణ, నటుడు తనికెళ్ల భరణి, వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
పింఛన్లకు రూ.2,693.90 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు నెలలో 61,92,396 మంది పింఛనుదారులకు ఎన్‌టిఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.2,693.90 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబరు ఒకటో తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు పంపిణీ చేస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా మంజూరైన 6,268 వితంతు లబ్ధిదారులకు ఒకటిన పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం రూ.2.51 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పింఛన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకుని రూ.73,506 కోట్లు ఖర్చు చేసిందన్నారు.







కామెంట్‌లు (0)