- అభిప్రాయాలు సేకరిస్తున్న వైద్యారోగ్యశాఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను బుధవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆయుష్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్, రెగ్యురేషన్) రూల్స్-2026 పేరుతో ముసాయిదా నిబంధనలను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాపై వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయుష్ అధికారులతో చర్చించారు. ప్రజలు, ఆయుష్ వైద్య రంగానికి చెందిన నిపుణులు, మేధావుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, వీటిని పరిశీలించిన అనంతరం కొత్త నిబంధనలు జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆస్పత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. వైద్య సంస్థలు అందిస్తున్న సేవలు, పడకల సామర్థ్యం ఆధారంగా ఏడు విభాగాలుగా వర్గీకరించారు. సింగిల్ డాక్టర్ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, 20 పడకలలోపు ఆస్పత్రులు, 21 నుంచి 50 పడకలు, 51 నుంచి 100 పడకలు, 101 నుంచి 200 పడకలు, 200 పడకలకు పైబడిన ఆస్పత్రులు ఈ కేటగిరీల పరిధిలోకి వస్తాయి. ఒకే సంస్థలో ఒకటి కంటే ఎక్కువ రకాల వైద్య సేవలు అందిస్తుంటే ప్రతి కేటగిరి కింద విడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని దరఖాస్తులను క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారానే సమర్పించాలి. దరఖాస్తు చేసిన వెంటనే 90 రోజులపాటు చెల్లుబాటయ్యే తాత్కాలిక నమోదు ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. రోగులకు అందించే వైద్య సేవలు, చికిత్సకు వసూలు చేసే రుసుములను ప్రతి క్లినిక్, ఆస్పత్రిలో తెలుగు, ఆంగ్ల భాషల్లో స్పష్టంగా ప్రదర్శించాలి. అక్కడ పనిచేస్తున్న వైద్యుల పేర్లు, వారి రిజిస్ట్రేషన్ నెంబర్లు, అందుబాటులో ఉన్న సేవలను కూడా రిసెప్షన్ వద్ద ఉంచాలి. సలహాలు, సూచనల కోసం ముసాయిదాను ఆయుష్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ayush.ap.gov.inలో బుధవారం నుంచి అందుబాటులో ఉంచారు. commr-apayush@ap.gov.in ద్వారా కూడా ప్రజలు, ఆయుష్ వైద్యులు, ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్య సంఘాలు, నిపుణులు రెండు వారాల్లో తమ విలువైన సలహాలు, సూచనలు, అభ్యంతరాలను వెబ్‌సైట్‌లోని ప్రత్యేక లింక్ ద్వారా తెలియజేయాలని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వెల్లడించారు.








కామెంట్‌లు (0)