- ఎపి వ్యవసాయ కార్మిక సంఘం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఏర్పడిన కరువు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు డి.రమాదేవి అధ్యక్షతన వడ్డేశ్వరంలోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం తీర్మానాలను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాధం మీడియాకు వెల్లడిస్తూ.. గత దశాబ్ధకాలంగా ఎన్నడూ లేనంతగా వర్షాభావం వల్ల రాష్ట్రంలో కరువు ఏర్పడిందన్నారు. కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు దొరకని పరిస్థితి కొన్ని చోట్ల నెలకొందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో నేటికీ 40 శాతానికి మించి సాగు జరగలేదని, లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారాయని, వ్యవసాయ పనులు లేక, మరోపక్క ప్రబుత్వం తగినంత ఉపాధి హామీ పనులు కల్పించక వ్యవసాయ కార్మికులు, సన్నా చిన్న కారు రైతులు పస్తులతో జీవించే పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ఏర్పడనుందని, తీవ్రమైన కరువు ఛాయలు నెలకొనే అవకావం ఉందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం తగిన ముందస్తు చర్యలు తీసుకోవడంలో, వ్యవసాయ కార్మికులను, పేదలను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిదన్నారు. రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కార్మికులు, రైతులు, గ్రామీణ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 688 మండలాలకు, 406 మండల్లాల్లో అతి తక్కువ వర్షపాతం, 204 మండలాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వర్షాకాలం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కరువు సహాయక చర్యలను ఎదుర్కొవడానికి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పనులు కల్పించడానికి నిర్ధిష్టమైన చర్యలు చేపట్టకపోవడం అత్యంత బాధ్యతా రాహిత్యంగా పేర్కొన్నారు. గతంలో కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు నాటి ప్రభుత్వాలు గ్రామీణ పేదలకు, రైతాంగానికి అనేక రకాలుగా సహాయక చర్యలు చేపట్టాయని, ఆరతడి పంటలకు సంబంధించిన విత్తనాలు అందించడం, పశువులకు గ్రాసం, తాగునీరు అందించడం, వ్యవసాయ కార్మికులకు ప్రతి నెలా రేషన్‌తోపాటు నెలకు రూ.2వేలు చొప్పున కరువు భత్యం చెల్లించినట్లు చెప్పారు. కానీ నేటి ప్రభుత్వం కార్పొరేట్ పెట్టబడిదారుల జపం చేస్తూ గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించిందని, ఈ కారణంగా అనేక గ్రామాల్లో పేదలకు పనులు లేక ఎక్కడికి పోవాలో దిక్కు తోచక అభద్రతాభావంతో జీవిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబానికి కనీసం 200 తక్కువ కాకుండా ఉపాధి పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి ఉచిత రేషన్, 6 నెలల పాటు నెలకు రూ.10 వేలు చొప్పున కరువు భత్యం చెల్లించాలని, వ్యవసయ కార్మికులు చేసిన ప్రైవేటు అప్పులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. త్రీవ కరువు, సంక్షోభం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వమే ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం, సెలవు దినాల్లో విద్యార్ధులకు భోజనం అందించడం, తాగునీటి సమస్య త్రీవంగా ఉన్న చోట్ల ట్యాంకర్లతీ నీటిని సరఫరా చేయాలన్నారు. డ్వాక్రా మహిళలకు పాత రుణాలను మాఫీ చేయడం, వడ్డీ లేని కొత్త రుణాల మంజూరు, పశువులకు ఉచితంగా గ్రాసం అందించడం వంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు వి.వెంకటేశ్వరు, కె.ఆంజనేయులు, దడాల సుబ్బారావు, శివనాగమణి, పుల్లయ్య, సత్యనారాయణ, అన్వేష్, కళ్యాణ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)