విజయవాడ : కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలపై విద్యుత్ బాదుడు మరింత పెరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్. బాబురావు ఆరోపించారు. గత రెండేళ్లలో సర్దుబాటు (ట్రూ-అప్) చార్జీల రూపంలో సుమారు రూ.21 వేల కోట్లకు పైగా అదనపు భారం మోపారని విద్యుత్ చార్జీలు పెంచలేదని, తగ్గించామని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శించారు. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్ల అంశాలపై ప్రభుత్వంతో బహిరంగ చర్చకు సిపిఎం సిద్ధమని అన్నారు. విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు డి. కాశీనాథ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల విద్యుత్ ప్రగతి నివేదిక అబద్ధాలు, అవాస్తవాలు, పాక్షిక సత్యాలతో నిండి ఉందని బాబురావు విమర్శించారు. గత 24 నెలలుగా ప్రతి యూనిట్‌పై రూ.1.88 నుంచి 62 పైసల వరకు అదనపు సర్దుబాటు చార్జీలు వసూలు చేశారని, ఇప్పటికీ రెండు రకాల అదనపు సర్దుబాటు చార్జీలు కొనసాగుతున్నాయని తెలిపారు. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల ట్రూ-అప్ చార్జీలు, గత కాలానికి సంబంధించిన బకాయిలు, అదనపు నెలవారీ సర్దుబాటు చార్జీలతో కలిపి మొత్తం రూ.21,885 కోట్ల భారం ప్రజలపై మోపారని ఆరోపించారు. ఇందులో కేవలం రూ.923 కోట్ల మేర మాత్రమే తగ్గించి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.5.42 నుంచి రూ.4.90కు తగ్గిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆ మేరకు వినియోగదారులకు ఛార్జీలు తగ్గించకుండా అదనపు సర్దుబాటు చార్జీలు ఎందుకు వసూలు చేస్తోందని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్ల భారం భరించిందన్న వాదన కూడా అవాస్తవమని, పంపిణీ సంస్థలకు ఇవ్వాల్సిన రూ.13,054 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కూటమి ప్రభుత్వం, ప్రస్తుతం ప్రతి ఇంటికీ వాటిని బలవంతంగా అమర్చేందుకు ప్రయత్నిస్తోందని బాబురావు ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని అన్నారు. అదానీ సంస్థ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా గత ప్రభుత్వం కుదుర్చుకున్న 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అమెరికా కోర్టులో కేసు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టకపోవడం విచారకరమని అన్నారు. గతంలో ఈ ఒప్పందం వల్ల ప్రజలపై భారీగా భారం పడుతుందని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందాన్ని రద్దు చేయకుండా అమలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ సర్దుబాటు చార్జీలు, స్మార్ట్ మీటర్ల అమలుపై ప్రభుత్వం బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరిన బాబురావు, సర్దుబాటు చార్జీల విధానాన్ని రద్దు చేసి వసూళ్లు నిలిపివేయాలని, విద్యుత్ వ్యయం తగ్గిన మేరకు యూనిట్‌కు 52 పైసలు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల బిగింపును నిలిపివేసి ఇప్పటికే అమర్చిన మీటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డి. కాశీనాథ్ మాట్లాడుతూ, 2000 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం నుంచి చంద్రబాబు ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదని విమర్శించారు. విద్యుత్ భారాల విషయంలో గత ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం పోటీ పడుతోందని అన్నారు. ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన నాయకులు ఇప్పుడు వాటి అమలుపై మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ భారాలలో గత ప్రభుత్వంతో కూటమి పోటీ పడుతోందని అన్నారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చిన లోకేష్ ఇప్పుడు నోరు మెదపడం లేదని,ప్రజలను భయపెట్టి మీటర్లు బిగిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో స్మార్ట్ మీటర్ల బిగింపును అడ్డుకుంటూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నామని, ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ పోరు కొనసాగుతుందని స్ఫష్టం చేశారు.








కామెంట్‌లు (0)