ఎస్‌వియు అకడమిక్ కన్సల్టెంట్ల ఆందోళన
ప్రజాశక్తి - క్యాంపస్ (తిరుపతి): సంవత్సరాలుగా బోధన సేవలు అందిస్తున్న అధ్యాపకులను రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాల్లో అనర్హులుగా ప్రకటించడం అన్యాయమని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం (ఎస్‌వియు) మెయిన్ గేట్ ఎదుట అకాడమిక్ కన్సల్టెంట్లు మంగళవారం ఆందోళన చేశారు. తమకు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కల్పించాలని, ఎస్‌వియులో పనిచేస్తున్న అకాడమిక్ కన్సల్టెంట్లను క్రమబద్ధీకరించాలని, యుజిసి మినిమం టైం స్కేల్‌ను అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రాంబాబు, కార్యదర్శి అంజన్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అకాడమిక్ కన్సల్టెంట్లు, టీచింగ్ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ అధ్యాపకులు, గెస్ట్ ఫ్యాకల్టీ పేర్లతో ఐదు నుంచి 20 సంవత్సరాల వరకు సేవలందిస్తున్న అధ్యాపకులను అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ‘ఇన్‌ఎలిజిబుల్’గా ప్రకటించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు బోధించడానికి, పరీక్షలు నిర్వహించడానికి, పరిశోధన కార్యక్రమాల్లో పాల్గొనడానికి తమ సేవలు అవసరమవుతున్నప్పుడు అర్హులమని భావించే ప్రభుత్వం, శాశ్వత ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి మాత్రం అనర్హులుగా ప్రకటించడం బాధాకరమన్నారు. తమ వేతనాల విషయంలోనూ తీవ్ర వివక్ష కొనసాగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు నెలకు సుమారు రూ.60 వేల వరకు వేతనం అందుతుండగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు యుజిసి పే స్కేల్ అమలవుతోందని, కానీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సంవత్సరాలుగా సేవలందిస్తున్న అకాడమిక్ కన్సల్టెంట్లకు మాత్రం కేవలం రూ.40 వేల గౌరవ వేతనం మాత్రమే చెల్లించడం అత్యంత వివక్షతో కూడిన చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)