- చందనాడ దళితులకు పునరావాసం కల్పించాలి
- దళిత శోషణ్ ముక్తిమంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు
- ‘సామాజిక శంఖారావం’లో భాగంగా దళితవాడల్లో పర్యటన
ప్రజాశక్తి - యంత్రాంగం : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడలో దళితులకు పునరావాసం కల్పించాలని దళిత శోషణ్ ముక్తిమంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ‘సామాజిక శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన చందనాడ దళితవాడలో ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.లోకనాథం, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు జి.కోటేశ్వరరావు, ఎం.అప్పలరాజు, వివి.శ్రీనివాసరావు, ఎం.సత్యనారాయణ, ఎం.రాజేష్ తదితరులతో కలిసి పర్యటించారు. గుల్లబట్టీల భూముల వరకు ర్యాలీగా నాయకులను తీసుకెళ్లి అక్కడి భూములను, స్మశాన వాటిక స్థలాన్ని దళితులు చూపించారు. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తమ దళిత కాలనీ చుట్టూ సిమెంట్ స్తంభాలతో ఫెన్సింగ్ వేస్తోందని, దీనివల్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తనున్నాయని, పది ఎకరాల 50 సెంట్లు గుల్లబట్టీల స్థలానికి పరిహారం చెల్లించలేదని తెలిపారు. దళిత, బిసి కాలనీకి అనుకుని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే తాము ఈ ప్రాంతంలో నివసించలేమని, వేరే ప్రాంతంలో పునరావాసం కల్పించాలని, ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు.ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... పిసిపిఐఆర్, వైజాగ్ - చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్, బల్క్ డ్రగ్, మిట్టల్ స్టీల్ ప్లాంట్ పేరిట ప్రజల మనోభావాలు అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా భూములు లాక్కొని కార్పొరేట్లకు కట్టబెడుతున్నాయని విమర్శించారు. చందనాడ దళిత, బిసి కాలనీని అష్టదిగ్బంధనంలో కాకుండా వారికి నచ్చిన ప్రాంతంలో పునరావాసం కల్పించాలని, 25 లక్షల ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ అమలు చేయాలని, అమరావతిలో మాదిరి ఇక్కడ కూడా 20 సంవత్సరాల పాటు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకనాథం మాట్లాడుతూ.. చందనాడ దళిత కాలనీలో కనీస మౌలిక సౌకర్యాలు కూడా లేవన్నారు. అనంతరం బుచ్చిరాజుపేట పంచాయతీ నల్లమట్టపాలెం గ్రామంలో వి.శ్రీనివాసరావు పర్యటించారు. అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం జి.సి. పాలెం, నారాయణపురం, గాలి చెన్నయ్యపాలెం గ్రామాల్లోని దళిత కాలనీల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎపి రైతు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం రాత్రి, శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా గాలి చెన్నయ్యపాలెం గ్రామస్తులు మాట్లాడుతూ… గ్రామాల్లోని రచ్చకట్టలపై కూర్చునే హక్కు కూడా తమకు లేదని, ఊరికి దూరంగా అసౌకర్యాల మధ్య నరకప్రాయమైన జీవితాన్ని వెల్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ...దళితుల సమస్యల పరిష్కారానికి ప్రజాసంఘాలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం చిన్నతుంబలం, ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు జిల్లా నాయకులు పర్యటించి దళితుల సమస్యలపై అధ్యయనం చేశారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొలనుకుదురు గ్రామంలో హరిజనవాడ, అరుంధతీయ వాడలో ఎపి వృత్తిదారుల సంఘం రాష్ర్ట కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య పర్యటించారు. ఆయన మాట్లాడుతూ...స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ దళితుల స్థితిగతులు మారలేదన్నారు. ముత్తుకూరు మండలం పిడతా పోలూరు పంచాయతీ పరిధిలోని దళితవాడలో సామాజిక శంఖారావం అధ్యయన బృందం పర్యటించింది.






కామెంట్‌లు (0)