శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మ్యాచ్‌ రిఫరీగా విన్సిచ్‌

1 గంట క్రితం

ffa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 01:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూ జెర్సీ : రేపు జరిగే వరల్డ్‌ ‌కప్‌ ‌ఫైనల్‌ ‌మ్యాచ్‌‌కు రిఫరీగా స్లోవ్కో విన్సిచ్‌ను ఫిఫా నియమించింది. 47 ఏళ్ల స్లోవ్కో విన్సిచ్ స్లోవేకియాకు చెందిన రిఫరీ. 2010 నుంచి ఈ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రపంచ కప్‌లో మ్యాచ్‌ నిర్వాహకులు, రిఫరీలు అర్జెంటీనాకు అనుకూలంగా ఉన్నారనే వాదన నేపథ్యంలో రిఫరీగా విన్సిచ్‌‌ను ఫిఫా నియమించిందనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే 2022 ఖతార్‌ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌ను అర్జెంటీనా గెలుచుకున్నా.. లీగ్‌ స్టేజ్‌లో అర్జెంటీనాకు సౌదీ అరేబియా చేతిలో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌కు విన్సిచ్ రిఫరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ మ్యాచ్‌‌లో సౌదీ అరేబియా 2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. ప్రస్తుతం విన్సిచ్ మరోసారి ఫైనల్‌కు వస్తుండటంతో మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనా శిబిరంలో గుబులు రేగుతోంది.

భావోద్వేగానికి గురైన విన్సిచ్

ఫైనల్‌ మ్యాచ్‌కు తనను రిఫరీగా ఫిఫా ప్రకటించడంతో విన్సిచ్‌ భావోద్వేగానికి గురయ్యారు. సహచరులు కంగ్రాట్స్‌ చెబుతుండగా కన్నీటిపర్యంతమయ్యారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచులకు రిఫరీగా వ్యవహించారు. ఓ మ్యాచ్‌లో ఈక్వెడార్‌ ఆటగాడు పీర్రో హిన్‌కేపీకి రెడ్ కార్డు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మైదానంలో దూకుడుగా ఉండే అర్జెంటీనా ఆటగాళ్లు రిఫరీతో జాగ్రత్తగా ఉండాలనేది నిపుణుల సూచన. ఏమాత్రం హద్దు దాటినా విన్సిచ్ ఉపేక్షించరని పేరుంది. మరోవైపు స్పెయిన్ ఆడిన చాలా మ్యాచులకు ఆయన రిఫరీగా వ్యవహించిన అనుభవం ఉంది. ఇది కూడా అర్జెంటీనా శిబిరాన్ని కలవరానికి గురి చేసే అంశమే.

విజేతలకు రింగ్‌‌లు ...

ఫిఫా ప్రపంచ కప్‌ విజేతలకు తొలిసారి రింగ్‌లను బహూకరించేందుకు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. మొత్తం 2026 రింగ్‌లను సిద్ధం చేయగా.. అందులో ఆటగాళ్లకు 30 ఇస్తారు. మిగిలిన రింగ్‌లను అభిమానులకు అందించనున్నారు. మెక్సికో, కెనడాతోపాటు అమెరికా వేదికగా ఈ మ్యాచులు జరిగిన సంగతి తెలిసిందే. ఇక వరల్డ్ కప్‌లో కేవలం ఫైనల్‌, థర్డ్‌ ప్లేస్‌ కోసం మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. స్పెయిన్‌, అర్జెంటీనా మధ్య న్యూజెర్సీలోని మెట్‌లైఫ్‌ స్టేడియంలో ఈ ఆదివారం జరిగే తుది పోరును వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరు కానుండటం విశేషం. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ ధ్రువీకరించారు. అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి విజేతలకు ప్రపంచకప్‌ను అందజేసే అవకాశం ఉందని ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో ఇటీవల వెల్లడించారు.

ఇదిలా ఉంటే, ఇంతకుముందు 1978, 1986, 2022లో ప్రపంచకప్‌ గెలిచిన అర్జెంటీనా.. మరోసారి కప్పుపై కన్నేసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై దూకుడుగా ఆడి విజయం సాధించింది. కప్‌ను కైవసం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. 1930, 1990, 2014లోనూ అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు, సమష్టి కృషితో స్పెయిన్‌ ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో బలమైన ప్రత్యర్థి ఫ్రాన్స్‌ని ఓడించి అర్జెంటీనాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్