కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సిఇఒ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్ -సర్)ను మరో పదిరోజుల పాటు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) వివేక్ యాదవ్ కోరారు. ఈ మేరకు ఇసిఐకి సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఓటర్ల గణన ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ గడువును మరో 10 రోజులపాటు పొడిగించాలని ఈ లేఖలో ఆయన కోరారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన వినతులు, కొన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి అందిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదన పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ నేటి(14వ తేది)తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ ప్రక్రియ నూరు శాతం పూర్తి కాలేదు. ఇదే విషయాన్ని లేఖలో ఆయన వివరిం చారు. రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రస్తావించారు. తుది ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా, వంద శాతం ఫారాల పంపిణీ పూర్తయింది. ఇప్పటి వరకు సేకరించిన వాటిలో 4,09,32,211 ఫారాలను (98.32 శాతం) డిజిటలైజ్ చేశామని, ప్రస్తుతం 6,95,483 ఫారాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.
39.81 లక్షల ఓట్లు రద్దు...
ఇప్పటిదాకా వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 39,81,399 ఓట్లు రద్దు కానున్నాయి. ఆ ఓట్లకు సంబంధించిన ఫారాలు సేకరించడం సాధ్యం కాదని సిఇఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వీరిలో 14,19,664 మంది ఓటర్లు చనిపోయినట్లు బిఎల్ఒలు గుర్తించారని, 12,14,994 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, 7,26,425 మంది ఓటర్లు ఇళ్ల వద్ద అందుబాటులో లేరని తేలిందన్నారు. వీటితోపాటు 6,06,506 మంది ఇప్పటికే ఓటరుగా నమోదై ఉన్నారని, మరో 13,830 మంది వివరాలుసైతం వివిధ కారణాలతో సేకరించడం సాధ్యం కావడం లేదని తెలిపారు. గడువు ముగుస్తున్న నేపథ్యంలో, ఇప్పటికీ తమ ఓటరు గణన ఫారంను పూర్తి చేసి వెనక్కి ఇవ్వని ఓటర్లు ఎవరైనా ఉంటే, వారు వెంటనే తమ బూత్ లెవల్ ఆఫీసర్లను సంప్రదించి ఫారాలను అందజేయాలని సిఇఒ వివేక్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.







కామెంట్‌లు (0)