ముఖ్యమంత్రికి నివేదించిన అధికారులు
ప్రత్యాయ్నాయాలు చూడండి : సిఎం ఆదేశం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదించినట్లు సమాచారం. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి నిర్వహించిన అంతర్గత సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు గణనీయంగా పెరిగిన అంశాన్ని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. ఈ కారణంగానే తొలి మూడు నెలల్లో భారీగా రుణాలు సేకరించాల్సి వచ్చిందని కూడా వారు వివరించినట్లు సమాచారం. కేంద్రం నుంచి రావలసిన గ్రాంట్లు ఇతర నిధుల్లో కూడా భారీగా కోతలు పడిన అంశాన్ని వారు ఒక నివేదిక ద్వారా చంద్రబాబుకు వెల్లడించినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు కూడా స్పందిస్తూ అన్ని ఆదాయ వనరుల మార్గాలను అధ్యయనం చేసి ఆదాయం పెంచేలా చూడాలని సూచించినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఇదే సమయంలో కేంద్రంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ రావాల్సిన నిధులు తగ్గకుండా చూడాలని ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అమలు చేసే వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎందుకు తగ్గాయా అన్నది కూడా ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏయే పథకాలకు ఎంత రావాలి, ఎంత వచ్చింది అన్నది తెలుసుకుని ఈ నిధులు పూర్తిస్థాయిలో వచ్చేలా కేంద్ర అధికారులతో మాట్లాడాలని రాష్ట్ర అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్థికశాఖ అధికారులు త్రైమాసిక గణాంకాలను ముఖ్యమంత్రికి సమర్పించారు.
ఆర్థిక సంవత్సరంలో రు. 2.34 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొలి త్రైమాసికంలో 39 వేల కోట్లు మాత్రమే వచ్చిందని, జిఎస్టి ద్వారా 62,681 కోట్లు రావాల్సి ఉండగా 13 వేల కోట్లు వచ్చాయని వివరించినట్లు తెలిసింది. కేంద్రం నుంచి రావలసిన నిధుల్లో భారీగానే కోతలు పడిన విషయాన్ని కూడా అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ మూడు నెలల్లో కేవలం 6.82 శాతంతో రు.2,215 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చినట్టు చెప్పగా ఈ విషయంపై కేంద్ర అధికారులతో మాట్లాడాలని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఇతర అధికారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)