30 మంది విద్యార్థులకు అస్వస్థత
ప్రజాశక్తి - కడప అర్బన్ : రిమ్స్ డెంటల్ హాస్పిటల్ వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి వసతి గృహంలో దోసె, చట్నీ తిన్న తర్వాత ఇద్దరు విద్యార్థినులకు వాంతులు, విరేచనాలయ్యాయి. వారిని వెంటనే రిమ్స్‌కు తరలించి వైద్యం చేయించారు. రాత్రి పది గంటల తర్వాత ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురికావడంతో వారి సంఖ్య పెరుగుతూ ఉదయానికి 30 మందికి చేరుకుంది. అప్రమత్తమైన రిమ్స్ అధికారులు మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
ప్రభుత్వ దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యుగంధర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు. జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య, సిఎస్ఆర్ఎంఒ డాక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విద్యార్థులలో ఎవరికీ సీరియస్‌గా లేదని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు.
మెస్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి: విద్యార్థి సంఘాలు
విద్యార్థులు అస్వస్థతకు కారకులైన మెస్ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి, వైసిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయి దత్త డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ నుంచి వచ్చే నిధులను విద్యార్థులకు సక్రమంగా, మెనూ ప్రకారం ఆహారం అందించకుండా ఇష్టారాజ్యాంగ కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులను ఈ విధంగా తీవ్ర అవస్థలకు గురి చేయడం ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని వారన్నారు. మెస్ కాంట్రాక్టర్ పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశాంత్ పాల్గొన్నారు.
వైద్య విద్యార్థినులకు మెరుగైన వైద్యం : కడప జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత
కలుషిత ఆహారం కారణంగా కడప రిమ్స్ వైద్య కళాశాల వసతి గృహ విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆర్యోగంపై ఆరా తీస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టరు చెరకూరి శ్రీధర్, డిఎంహెచ్ఒ రవి రాథోడ్‌ను ఫోన్లో ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంపై నివేదికివ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, రిమ్స్‌లో ఉంచే వైద్య సేవలు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్, డిఎంహెచ్ఒ రవి రాథోడ్ వివరించినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులకు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. హాస్టల్‌లో మిగిలిన విద్యార్థినులకూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, తాజా ఆహారంతో పాటు వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే అందించాలని సూచించారు.








కామెంట్‌లు (0)