ఎపి విద్యా విధానాలను ప్రశంసించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు
ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ఆంధ్రప్రదేశ్‌లో ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం కొనియాడింది. ప్రపంచ బ్యాంక్ సౌత్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ జాన్ రూమ్ జుట్ ఆధ్వర్యాన సోమవారం విశాఖపట్నంలోని 62వ వార్డు పరిధి త్రినాథపురంలోని జివిఎంసి ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యా కార్యక్రమాలను పరిశీలించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సాల్ట్’ (సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్) కార్యక్రమం కింద మోడల్ ఫౌండేషన్ స్కూల్ సాధించిన పురోగతి, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అమలును పరిశీలించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరి, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రతినిధి కె సురేష్ పాఠశాల అభివృద్ధిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం ప్రపంచ బ్యాంక్ బృందం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించింది. చిన్నారులతో ముచ్చటించి, బాలల స్నేహపూర్వక అభ్యాస పద్ధతులను పరిశీలించింది. ‘ఫోర్ కార్నర్స్ లెర్నింగ్ స్పేస్’, ‘జాదూయి పిటారా’ ఆధారిత బోధనా కార్యక్రమాలు, స్కూల్ రెడీనెస్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించింది. ఐసిడిఎస్, పాఠశాల విద్యాశాఖల మధ్య సమన్వయంతో పిల్లల అభ్యాస పురోగతిని మెరుగుపరుస్తున్న తీరును ప్రత్యేకంగా అభినందించింది.
ప్రతి బిడ్డకూ జీవితాంతం నేర్చుకునే నైపుణ్యాల పునాదిని అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయమని ప్రపంచ బ్యాంక్ బృందం పేర్కొంది. ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, ప్రభుత్వ విభాగాలు కలిసి పిల్లలకు ఉత్తమ అభ్యాస వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అభినందించింది. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అదనపు డైరెక్టర్ కె నాగేశ్వరరావు, సాల్ట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ వి సతీష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎన్ ప్రేమకుమార్, సమగ్ర శిక్ష ఎపిసి జె చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)