ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బిఎస్‌కె) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 441 మంది చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ చక్రధర్‌బాబు వెల్లడించారు. ఈ వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు శనివారం వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 289 మంది, పాఠశాల స్క్రీనింగ్‌లో 152 మందిని గుర్తించి శస్త్ర చికిత్సలు చేశారన్నారు. మొత్తం రూ.2.42 కోట్లు వ్యయం అయిందన్నారు. నిర్వహించిన శస్త్ర చికిత్సలు ప్రధానంగా రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ (తక్కువ బరువుతో జన్మించిన శిశువుల కంటి సమస్యకు అత్యధిక శస్త్ర చికిత్సలు) 132 మందికి, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలేట్ (పుట్టుకతో పెదవి, అంగిలి చీలిక సమస్యకు) 72 మందికి, క్లబ్ ఫుట్ (పుట్టుకతో పాదం వంకర సమస్యకు) 35 మందికి, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ (పుట్టుకతో వచ్చే గుండె జబ్బులకు) 30 మందికి, కంజెనిటల్ డెఫ్ నెస్ 10 మందికి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఆరుగురు, కంజెనిటల్ క్యాటరాక్ట్ నలుగురికి నిర్వహించగా, మిగిలిన 152 - స్క్వింట్, టాన్సిలైటిస్, అపెండిసైటిస్, టంగ్ టై తదితర సమస్యలకు శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొత్తం 441లో 238 శస్త్ర చికిత్సలు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగాయన్నారు. ప్రభుత్వంలో అందుబాటులో లేని సేవలను ఆర్‌బిఎస్‌కె కింద టైఅప్ అయిన 15 ప్రైవేట్ ఆస్పత్రుల్లో డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ, పిఎం జెఎవై ద్వారా ఉచితంగా నిర్వహించామన్నారు.






కామెంట్‌లు (0)