చరిత్రలో రెండోసారి అమ్మాయిల అత్యుత్తమ ప్రదర్శన
మహిళల హాకీ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా
షూటౌట్‌లో నెదర్లాండ్స్‌పై గెలుపు
ఆమ్‌స్టెల్వీన్(నెదర్లాండ్స్): నెదర్లాండ్స్-బెల్జియం వేదికలుగా జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. పురుషుల జట్టుతో పోలిస్తే మహిళల జట్టు 5వ స్థానంలో నిలువగా.. పురుషుల జట్టు కీలక పోటీల్లో ఓటమికి తోడు 7వ స్థానానికి జరిగిన పోరులో ఆతిథ్య బెల్జియం చేతిలో పెనాల్టీ షూటౌట్‌లో ఓడి 8వ స్థానానికి పరిమితమైంది. గత ఫార్మాట్‌కు భిన్నంగా ఈసారి 16జట్ల మధ్య జరిగిన ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో ముఖ్యంగా సలీమా టేటే నేతృత్వంలోని భారత జట్టు ప్రదర్శన గొప్పదని చెప్పుకోవచ్చు. పూల్ దశలో ఓటమి ఎరుగని సలీమా టేటే బృందం రౌండ్-2లో ఆతిథ్య నెదర్లాండ్స్ చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో ఆ ఒక్క మ్యాచ్ ఓటమి మినహా.. పరాజయం పాలైన దాఖలాలు లేవు. ఆడిన ఐదు మ్యాచుల్లో 4డ్రాలు, ఒక పరాజయంతో ముగించింది. శుక్రవారం 5వ స్థానం కోసం జర్మనీ మహిళలతో జరిగిన కీలక పోరులో భారత మహిళలజట్టు 3-1తో గెలిచిన తీరు వర్ణణాతీతం. తొలి రెండు క్వార్టర్లు ముగిసేసరికి 1-0తో వెనుకబడ్డా.. ఆ తర్వాత పుంజుకున్న తీరు అత్యద్భుతం. తమకంటే మెరుగైన ర్యాంకుల్లో ఉన్న చైనా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో మ్యాచ్‌లను డ్రా చేసుకొని, దక్షిణాఫ్రికాపై 6-1 తేడాతో భారీ విజయం సాధించడం రికార్డే. చీఫ్ కోచ్ జోర్డ్ మారిన్ పర్యవేక్షణలో జర్మనీని చిత్తు చేసి ఐదో స్థానంతో ముగించింది. దీంతో గత 52 ఏళ్ల టోర్నీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరల్డ్ కప్ లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ముగింపు కావడం విశేషం. దీంతో హాకీ ఇండియా(హెచ్‌ఐ) భారత మహిళజట్టుకు రూ.50 లక్షల నజరానాను ప్రకటించింది. ఎఫ్‌ఐహెచ్ ర్యాంకింగ్స్‌లో మహిళల జట్టు 8వ స్థానంలో ఉండగా.. 6వ ర్యాంకర్ జర్మనీ జట్టును చిత్తుచేశారు. పూల్-డిలో 4వ ర్యాంక్ జట్టు చైనాతో మ్యాచ్‌ను 2-2తో డ్రా చేసుకున్నది మెచ్చుకోదగ్గదే. టోర్నీలో భారత మహిళల జట్టు ప్రదర్శనపై మాజీ గోల్‌కీపర్ సవిత పునియా మాట్లాడుతూ.. కొత్త కోచ్‌గా మారీన్ సారథ్యంలో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోందని, ప్రాక్టీస్, కసరత్తుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని, భారత మహిళల హాకీ జట్టు ఉజ్వల భవిష్యత్తు ఉందని తెలిపింది.
మూడోసారి టైటిల్ కొట్టిన అర్జెంటీనా
ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్ మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను అర్జెంటీనా జట్టు మూడోసారి చేజిక్కించుకుంది. వాఘెనార్ హాకీ స్టేడియంలో శనివారం జరిగిన తుది పోరులో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లాండ్స్ మహిళలపై సంచలన విజయం సాధించింది. మూడు క్వార్టర్లు ముగిసేసరికి 0-1తో వెనుకబడిన అర్జెంటీనా మరో 6నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా గోల్ కొట్టి స్కోర్‌ను 1-1తో సమం చేసింది. షూటౌట్‌లో 3-1తో నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. నెదర్లాండ్స్ తరఫున ఏకైక గోల్‌ను జాన్సెన్ వెబ్బి(30వ ని.) చేయగా.. అర్జెంటీనా తరఫున కీలక గోల్‌ను మారియా 54వ ని.లో చేసింది. దీంతో నెదర్లాండ్స్ రన్నరప్(రజత పతకం)కే పరిమితం కాగా.. కాంస్య పతకాన్ని ఆతిథ్య బెల్జియం మహిళల జట్టు గెలుచు కుంది. 3వ స్థానం కోసం జరిగిన పోరులో బెల్జియం 1-0తో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించింది.








కామెంట్‌లు (0)