పార్టీ శ్రేణులకు వైయస్ జగన్ పిలుపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని వైసిపి శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలు గెలుపోటములకు సంబంధించినవి కావని, కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే టిడిపి కూటమికి వ్యతిరేక ఓటు వస్తుందని అన్నారు. వైసిపి కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలకు ప్రభుత్వం మొగ్గు చూపుతోందని, బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలన్నారు. ఎక్కడా కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలవకూడదని, కచ్చితంగా వైసిపి పోటీ చేయాలని అన్నారు. టిడిపి కూటమి రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే జరిగాయన్నారు. స్థానిక ఎన్నికలకు వైసిపి ప్రతి నియోజకవర్గంలో లీగల్‌సెల్, మీడియాసెల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. బలమైన అభ్యర్థి పోటీ చేయడంతోపాటు అందరితో మమేకమై అహంకార ధోరణి లేకుండా పని చేయాలని సూచించారు. పార్టీలో పక్కాగా అందరికీ ఐడీ కార్డుల పంపిణీ చేయాలని తెలిపారు. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటా ప్రచారం నిర్వహించాలని, ఆ మేరకు షెడ్యూల్ ఖరారు చేసి అన్నిచోట్లా ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ అనే అంశంపై బుక్‌లెట్లు పంపిణీ చేయాలని అన్నారు.
స్థానిక ఎన్నికలు సందేహమే? అయినా సన్నద్ధం..
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, వాటిని వైసిపి కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఈ ఎన్నికలు జరుగుతాయా? లేదా? తెలియడం లేదని, ఒకవైపు 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారని, ‘ఎస్‌ఐఆర్’ రిపోర్టు కూడా అదే చెబుతోందని అన్నారు. మరోవైపు ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని, అంటే లేని ఓట్లు ఉన్నట్లుగా చూపుతున్నారని, అది చట్ట ప్రకారం నేరమని తెలిపారు. అలాగే పట్టణ స్థానిక ఎన్నికల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ అంశమని, గతంలో తాము ఇవ్వాలనుకుంటే, కోర్టు కొట్టేసిందని, అయినా దానిపై సిఎం కావాలని జిఓ ఇచ్చి, ఎన్నికలకు వెళ్తున్నారని తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే, అసలు స్థానిక ఎన్నికలు జరుపుతారా లేదా? అనేది అనుమానం వస్తోందని పేర్కొన్నారు. అయినా, ఎన్నికలు జరుగుతాయన్న ఆలోచనతోనే నాయకత్వం సిద్ధం కావాలని సూచించారు.
సంస్థాగత సమావేశాల షెడ్యూల్
సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించాలని, ఇందులో పార్టీ జిల్లా స్థాయి నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు, జిల్లా స్థాయిలో అన్ని కమిటీల ఇన్‌ఛార్జులు, పార్టీ సీనియర్ నాయకులు, జడ్‌పి ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొనాలని తెలిపారు. సెప్టెంబరు 8, 9, 10, 11 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. సెప్టెంబరు 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు జరుగుతాయని అన్నారు. ఇంటింటి ప్రచారం కార్యక్రమం సెప్టెంబరు 23 నుంచి కొనసాగుతుందని అన్నారు.






కామెంట్‌లు (0)