181 కొత్త ఘాట్ల నిర్మాణంతో సహా 440 ఘాట్ల అభివృద్ధి
10 కోట్ల మంది పాల్గొంటారని అంచనా
గోదావరి పుష్కరాలపై *సిఎం చంద్రబాబు సమీక్ష
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గోదావరి పుష్కరాల్లో భాగంగా రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనులు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై ముఖ్యమంత్రి రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు 12 రోజులపాటు పుష్కరాలు అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు. ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులూ ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని, స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల పనులకు సంబంధించి ఇప్పటికే రూ.899 కోట్లు ఆర్థిక శాఖ కేటాయించిందని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. వీటిలో పట్టణాభివృద్ధి, ఆర్ అండ్ బి, జల వనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయని, ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో 1,869, పశ్చిమ గోదావరిలో 625, అంబేద్కర్ కోనసీమలో 1,501, ఏలూరులో 426, కాకినాడలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారని తెలిపారు. ఈ పనుల పూర్తికి అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్ర సాయం కూడా తీసుకోవాలని అధికారులకు సిఎం సూచించారు. గోదావరి పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు అధికారులు వివరించారు. రోజుకు సుమారు కోటి మంది స్నానాలు చేసే అవకాశం ఉందన్నారు. రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 82 ఘాట్లు, పశ్చిమగోదావరిలో 40 ఘాట్లు, అంబేద్కర్ కోనసీమలో 175 ఘాట్లు, ఏలూరులో 44 ఘాట్లు, కాకినాడలో 88 ఘాట్లు, పోలవరంలో 11 ఘాట్లు అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.
టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి
గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని.. పిఠాపురంలో శక్తి పీఠం సహా పంచారామాల్లో 4 క్షేత్రాలు, ఇంకా ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ.. టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని అధికారులకు సిఎం సూచించారు. పుష్కరాలకు వచ్చే యాత్రికులు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హోం స్టేలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టేవారికి త్వరితగతిన అనుమతులివ్వాలన్నారు. రాజమహేంద్రవరంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని, దేశ విదేశాల్లో ప్రముఖులు అందరికీ గోదావరి పుష్కరాలకు ఆహ్వానం అందించాలన్నారు. కూచిపూడి ఈవెంట్ వంటివి భారీ తరహాలో నిర్వహించేలా దేవాదాయ-పర్యాటక శాఖలు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
పుష్కర ఘాట్లను కలిపే రహదారుల నిర్మాణం సహా, పుష్కరాలు జరిగే 6 జిల్లాల్లో ఏ రోడ్లపైనా గుంతలు కనిపించకూడదన్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేలా రహదారుల నిర్మాణం జరగాల్సి ఉందని, బ్రిడ్జిల సామర్ధ్యాన్ని పరిశీలించి, దానికనుగుణంగా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పుష్కరాల్లో భద్రత, రద్దీ నిర్వహణకు అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిర్ణయించారు. వైద్య సేవల పరంగానూ ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంబులెన్స్‌లు, ఫస్ట్ ఎయిడ్, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. 30 ఫీల్డ్ ఆస్పత్రులను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసి, వాటికి అనుబంధంగా ల్యాబ్‌లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. గోదావరి నదీ పరివాహక జిల్లాల్లోని 260 గ్రామ పంచాయతీల్లో 50 గ్రామ పంచాయతీలను మోడల్ పుష్కర పంచాయతీలుగా అభివృద్ధి చేయనున్నామన్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బిసి జనార్ధన్ రెడ్డి, వై సత్యకుమార్ యాదవ్, గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)