జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సమ్మె విరమణ పట్ల హర్షం
ప్రజాశక్తి-అమరావతి : జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె విరమించి విధుల్లో చేరాలని నిర్ణయించుకోవడంపై హైకోర్టు హర్షం వ్యక్తం చేసింది. వారి న్యాయబద్ధమైన డిమాండ్లపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, దాని గౌరవాన్ని పెంచేలా సమ్మె విరమణ నిర్ణయం తీసుకున్నందుకు జూడాలను అభినందించింది. ‘నిరసన తెలియజేయొద్దని మేం చెప్పడం లేదు. అయితే వైద్యుడు కనిపిస్తేనే అనారోగ్యంతో వచ్చిన వ్యక్తికి సగం జబ్బు నయమైన భావన కలుగుతుంది. వైద్య నిపుణుడు తనను చూసుకుంటాడనే నమ్మకం, భరోసా రోగికి లభిస్తుంది’ అని ధర్మాసనం పేర్కొంది. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న బాధను అర్థం చేసుకోగలమని, అయితే వైద్యులు విధులకు దూరంగా ఉండటం వల్ల రోగులకు ఇబ్బందులు ఏర్పడటం, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడటం సరికాదంది. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరసన తెలిపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. జూడాల సమ్మె కారణంగా ప్రభుత్వాస్పత్రులు, వైద్య కళాశాలల్లో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని, తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన సామాజిక కార్యకర్త గూడూరి వెంకట రత్న కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సిజె జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. పిటిషనర్ తరపున న్యాయవాది యరగొర్ల ఠాగూర్ యాదవ్ వాదిస్తూ.. సమ్మెతో ఈ నెల 17 నుంచి అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయని అన్నారు. వరుసగా రెండు రోజులు విధులకు గైర్హాజరు కావడం క్రమశిక్షణారాహిత్యమని, నిబంధనల ప్రకారం డీబార్, రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలు ఉండవచ్చని తెలిపారు. ప్రభుత్వం తరపున ఎజి దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్టైఫండ్ పెంపుపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని, హౌస్ సర్జన్లకు 10 శాతం, పిజి రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీలకు 3 శాతం పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జూడాలు మాత్రం 15 శాతం కోరుతున్నారని వివరించారు. జూడాల తరపున న్యాయవాది భూమా మహర్షి రెడ్డి మాట్లాడుతూ.. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని, అత్యవసర సేవలకు జూడాలు అందుబాటులోనే ఉన్నారని తెలిపారు.







కామెంట్‌లు (0)