మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిపిఎం నాయకులపై రౌడీషీట్లు ఎత్తేయాలి

1 గంట క్రితం

cpmlogo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 12:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • హోంమంత్రికి సిపిఎం ప్రతినిధి బృందం వినతి

  • నిరంతర వేధింపులు, బెదిరింపులు ఆపాలి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు అందుగుల ఫ్రాన్సిస్ జీలుగుమిల్లి మండల కార్యదర్శిగా పనిచేసిన తెల్లం దుర్గారావుపై రౌడీషీట్‌ ఎత్తేయాలని, ఎటువంటి స్పష్టమైన కేసు/దర్యాప్తు కారణం తెలియజేయకుండా పోలీస్టేషన్‌కు పదేపదే పిలిపిస్తూ వేధిస్తున్న పోలీసు అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం ప్రతినిధి బృందం.. హోంమంత్రి వంగలపూడి అనితను కోరింది. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి, ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్‌ లింగరాజు, తెల్లం రామకృష్ణ, పోటోజు నాగేశ్వరరావు తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు. తెల్లం రామకృష్ణ డిగ్రీ చదువుకొని విద్యార్థి సంఘం ద్వారా కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులై పూర్తికాలం కార్యకర్తగా, గత 15 ఏళ్లుగా సిపిఎం మండల కార్యదర్శిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇటీవల ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చి 15 రోజులు ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారని, ప్రస్తుతం మందులు వాడుతున్నారని, ఆయనపై అక్రమ రౌడీషీట్ ఓపెన్ చేశారని అన్నారు. బుట్టాయిగూడెంకు చెందిన అందుగుల ఫ్రాన్సిస్ సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సభ్యునిగా గత 20 ఏళ్లుగా పని చేస్తున్నారని, గిరిజనులకు అండగా నిలబడి పోరాడుతున్నారని, గత 15 ఏళ్ల క్రితం అక్రమంగా రౌడీషీట్ ఓపెన్ చేసి ఇప్పటికీ కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈయనకు కూడా గుండె జబ్బుతో స్టంట్ వేశారని, ప్రస్తుతం మందులు వాడుతున్నారని పేర్కొన్నారు. వంకావారిగూడెం గ్రామం, జీలుగుమిల్లి మండలం వంకావారి గూడానికి చెందిన తెల్లం దుర్గారావు సిపిఎం జీలుగుమిల్లి మండల కార్యదర్శిగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఈయనపై కూడా రౌడీషీట్ పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. వీరి ముగ్గురిపై రౌడీషీట్ ఉందనే కారణంతో పోలీసు అధికారులు ఎటువంటి స్పష్టమైన కేసు వివరాలు తెలపకుండా పోలీస్టేషన్‌‌కు రావాలని ​పదేపదే ఫోన్ ద్వారా/మౌఖికంగా ఆదేశిస్తున్నారని అన్నారు. అయితే వీరిని ఏ కేసు లేదా ఏ దర్యాప్తు నిమిత్తం పిలుస్తున్నారో స్పష్టంగా తెలియజేయడం లేదని, దీనివల్ల వీరికి తీవ్ర మానసిక ఇబ్బంది, వేధింపులు కలుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. సిపిఎం 1/70 చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని కోరుతోందని, ఏలూరు జిల్లా ఏజెన్సీలో గత 30 ఏళ్లుగా పార్టీ గిరిజనుల తరపున పోరాడుతోందని, నాయకత్వం మీద అనేక తప్పుడు కేసులు వచ్చినప్పటికీ వాటిని ఎదుర్కొని గిరిజనుల పక్షాన నిజాయతీగా పనిచేస్తోందని అన్నారు. దానిలో భాగంగానే తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావు గిరిజనుల పక్షపాతిగా గిరిజన, ఇతర పేదలకు అనుకూలంగా సిపిఎం అవగాహనను అమలు చేస్తున్నారని అన్నారు. అలాంటి నిజాయతీగా పనిచేసే సిపిఎం జిల్లా నాయకులపై రౌడీషీట్ ఓపెన్ చేయడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. రౌడీషీట్ ఉందనే ఒక్క కారణంతో, ఎటువంటి నిర్దిష్ట దర్యాప్తు కారణం లేకుండా లేదా చట్టబద్ధమైన నోటీసు లేకుండా వీరిని పదేపదే పోలీస్టేషన్‌‌కు పిలిపించి వేధించడం, బెదిరించడం లేదా వారి స్వేచ్ఛకు అనవసరంగా భంగం కలిగిస్తున్నారని, అటువంటివి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారిపై రౌడీషీట్లు రద్దు చేయించాలని కోరారు. పోలీసులు చట్టబద్ధమైన కారణంతో విచారణ చేయాల్సి ఉంటే తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావు చట్టానికి పూర్తిగా సహకరిస్తారని, వారి పట్ల ఎటువంటి అక్రమ నిర్బంధం, బెదిరింపు లేదా వేధింపు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో వీరిని పిలవాల్సి వస్తే, సంబంధిత కేసు/దర్యాప్తు వివరాలు చట్టబద్ధమైన నోటీసు ద్వారా మాత్రమే పిలవాలని సంబంధిత అధికారులకు సూచించాలని కోరారు. తమ ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు. వారి హక్కులు, చట్టబద్ధమైన స్వేచ్ఛను కాపాడుతూ తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. తెల్లం రామకృష్ణపై, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావుపై పెట్టిన అన్ని కేసుల వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా ఇప్పించాలని బుట్టాయిగూడెం పోలీస్టేషన్లో నెలరోజుల క్రితమే దరఖాస్తు చేశామని, నేటికీ చట్ట ప్రకారం వివరాలు ఇవ్వలేదని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్