నేడు పాయకరావుపేట వద్ద సిఎం చంద్రబాబు జల హారతి
ప్రజాశక్తి - పాయకరావుపేట, అనకాపల్లి విలేకరులు : పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి నీళ్లు ఉత్తరాంధ్రకు రానున్నాయి. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలకు బుధవారం హారతి ఇవ్వనున్నారు. కాలువపై నిర్మించిన రెగ్యులేటర్‌ను ఆన్ చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడిచి పెట్టనున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు పాయకరావుపేటకు సిఎం చేరుకుంటారు. జల హారతి కార్యక్రమం అనంతరం సమీపంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
జలహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర అధికారులు, పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జలహారతి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో జన సమీకరణ, సభా ఏర్పాట్లు, తాగునీరు, ఆహారం సరఫరా తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.







కామెంట్‌లు (0)