ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలి
‘బద్లావ్ జరూరీ’ ర్యాలీలో సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బద్లావ్ జరూరీ హై ‘మార్పు అనివార్యం’ అనే నినాదంతో మంగళవారం సిపిఐ నిర్వహించిన ‘ఢిల్లీ చలో’ ర్యాలీలో దేశవ్యాప్తంగా వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు కదంతొక్కారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాగ్రహం ర్యాలీలో వెల్లువెత్తింది. ఆర్ఎస్ఎస్-బిజెపి పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు అమర్‌జీత్ కౌర్, అన్నీ రాజా, ప్రకాశ్ బాబు, ఎంపి పి సంతోష్ కుమార్, కె రామకృష్ణ తదితరులు ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు అణచివేత, వరదలు, ప్రతికూల వాతావరణం, సుదీర్ఘ ప్రయాణాలను అధిగమించి ఢిల్లీకి చేరుకుని ఆర్ఎస్ఎస్-బిజెపి పాలనకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారని డి రాజా అభినందించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ఏలుబడిలో దేశంలో సంక్షోభంలో కూరుకుపోయిందని, ఈ విపత్కర పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేయాలంటే రాజకీయ మార్పు అనివార్యమని ఆయన అన్నారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సంక్షోభం తీవ్రమవుతున్నాయని, కార్మికుల హక్కులపై దాడులు, ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం, విద్య, వైద్య రంగాల వాణిజ్యకరణతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్-బిజెపి రాజ్‌ను ఓడించేందుకు ప్రజలంతా మరోసారి ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం, మెరుగైన భారతదేశం నిర్మాణం కోసం నిరంతర ఉద్యమానికి ఇది ఆరంభమన్నారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని, వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చట్టబద్ధ హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించాలని, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల నిర్వహణను పునరుద్ధరించాలని, దళితులు, ఆదివాసీలకు సామాజిక న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతోందో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
డిసెంబర్‌లో జైల్‌భరో ఆందోళన
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబరు మొదటి వారంలో జైల్‌భరో ఆందోళన నిర్వహించనున్నట్లు సిపిఐ ప్రకటించింది. ‘మార్పు అనివార్యం’ పేరుతో చేపట్టిన ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపింది. అక్టోబరు రెండున గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజా తెలిపారు. అక్టోబరు సోషలిస్టు విప్లవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబరు ఏడున కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)